ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి రైతుల మహాపాదయాత్ర 2.0.. రాజకీయ పార్టీల మద్దతు - అమరావతి అన్నదాతల మహాపాదయాత్ర

Political Parties Support To Padayatra : రాజధాని ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి నుంచి అరసవల్లికి రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతుల మలివిడత మహాపాదయాత్రకు రాజకీయ పక్షాల మద్దతు లభించింది. వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు.. తొలిరోజు రైతులకు తోడుగా కదిలొచ్చాయి.

Political Parties Support To Padayatra
Political Parties Support To Padayatra

By

Published : Sep 12, 2022, 7:50 PM IST

అమరావతి రైతుల మహాపాదయాత్రకు.. రాజకీయ పార్టీల మద్దతు

Political Parties Support To Maha Padayatra : అమరావతి రైతుల మహాపాదయాత్ర 2.O ఘనంగా ప్రారంభమైంది. రాజధాని ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి నుంచి అరసవల్లికి రైతులు పాదయాత్ర చేపట్టారు. వెంకటపాలెంలోని తితిదే ఆలయం వద్ద రైతులు ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు హారతులు పట్టి ఆలయం నుంచి మహాపాదయాత్ర ప్రారంభించారు. రాజధాని గ్రామాల రైతులు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వెంకటేశ్వరస్వామి రథం పాదయాత్రలో ఆకర్షణగా నిలిచింది. అమరావతి అన్నదాతల మహాపాదయాత్రకు.. తొలిరోజున రాజకీయపార్టీల నుంచి అపూర్వ మద్దతు లభించింది. తెలుగుదేశం, జనసేన, భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇలా వైకాపా మినహా అన్ని రాజకీయపార్టీలు రైతుల యాత్రకు సంఘీభావం ప్రకటించి.. వారితో కలిసి అడుగేశాయి.

వైకాపా నేత సతీష్‌ చంద్ర కూడా.. అమరావతి రైతులకు మద్దతు ప్రకటించారు. 2019లో జగన్‌ గెలుపు కోసం ఊరూరా తిరిగి ఓట్లు వేయించామని గుర్తుచేసుకున్న ఆయన.. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ప్లేటు ఫిరాయించినా.. ప్రజలు మాత్రం అమరావతికే కట్టుబడి ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడవుగా కేంద్రం నిధులిస్తూ వచ్చిందని.. జగన్ సీఎం అయ్యాక అమరావతికి నిధులు అడగటమే మానేశారని.. భాజపా నేత నాగభూషణం అన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని తరలించే సాహసం జగన్‌ చేయలేరని చెప్పారు. రాజధాని రైతులంతా వైకాపా నేతలకు డబ్బులిస్తారని.. అరసవల్లి నుంచి అమరావతికి పాదయాత్ర చేయగలరా అని తెలుగుదేశం నేత తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

అమరావతి విషయంలో.. వైకాపా, భాజపావి దొంగ నాటకాలంటూ.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి విమర్శించారు. రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న ఆమె.. ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు. మూడేళ్లుగా ఏం చేశారని.. వైకాపా నేతలు ఇప్పుడు 3 రాజధానులంటున్నారని మండిపడ్డారు.

రాజధాని రైతుల పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసైనా.. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని.. మాజీ మంత్రి దేవినేని ఉమ హితవు పలికారు. నక్కా ఆనందబాబుతో కలిసి ఆయన రైతుల మహాపాదయాత్రలో నడిచారు. అమరావతితో రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న స్పృహ కూడా వైకాపా ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

జగన్‌కు ధైర్యం ఉంటే.. అసెంబ్లీ రద్దు చేసి అమరావతి అంశంపై ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్‌ సవాల్ విసిరారు. రైతులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. రాజధాని పనులు నిలిపేసి.. ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుందని దుయ్యబట్టారు.

పాదయాత్రకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచీ మద్దతు తెలిపేందుకు అనేక మంది తరలివచ్చారు. అలాగే న్యాయవాదులు, ఇతర వర్గాల వారూ సంఘీభావం తెలిపారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details