నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. మంగళవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండటం వల్ల... కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఆసుపత్రికి చేరుకున్న శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. జీవితాంతం ప్రజలకోసం వారి హక్కుల కోసం పోరాడారని... తాను నమ్ముకున్న సిద్ధాంతాలకోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్య అని హరీశ్‌రావు అన్నారు.
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పని చేసిన నాయకుడిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. తెరాస పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు ఆయన మరణం తీరని లోటు అన్న సీఎం... నర్సింహయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొత్తపేటలోని నోముల నర్సింహయ్య నివాసంలో ఆయన భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. నర్సింహయ్య అందించిన సేవలను గుర్తుచేసుకున్న కేటీఆర్... కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
నర్సింహయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నోముల మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నోముల కుటుంబ సభ్యులకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి జగదీశ్రెడ్డిరెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం... నోముల నర్సింహయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. జీవితాంతం ప్రజల కోసం... వారి హక్కుల కోసం పోరాడారని నేతలు స్మరించుకున్నారు. తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం పట్ల కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం చేసిన నాయకుడని కొనియాడారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన హాలియాలో నర్సింహయ్య భౌతికకాయంతో ఊరేగింపు నిర్వహించారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం నకిరేకల్ మండలం పాలెంలో జరగనుండగా... ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి: