భాజపా నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
మాణిక్యాలరావు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం మాణిక్యాలరావు మృతికి సంతాపం తెలిపారు. మాణిక్యాలరావు మరణం తమను తీవ్రంగా కలచివేసిందని తెదేపా నేత చినరాజప్ప అన్నారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సంతాపం తెలిపారు.
నటుల సంతాపం
మాణిక్యాలరావు మృతి పట్ల ప్రముఖ నటులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పార్టీ నేతల సంతాపం
మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి బాధాకరమని.. భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జిల్లా స్థాయి నాయకుడి నుంచి మంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి.. ప్రస్తుత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.