High Court: చట్టబద్ధత లేని ఏపీ పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ (పీఎస్‌వో) ఆధారంగా రౌడీషీట్ తెరవడం, వాటిని కొనసాగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పీఎస్‌వోలు కేవలం పరిపాలనపరమైన మార్గదర్శకాలేనని స్పష్టం చేసింది. రౌడీషీట్ నమోదు, వాటిని కొనసాగించడం, ఆ వ్యక్తులపై నిఘా ఉంచడం, తరచూ ఠాణాలకు పిలవడం, వారి ఫొటోలను పోలీసుస్టేషన్లో ప్రదర్శించడం వ్యక్తుల గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది.
కేఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించడమేనంది. పీఎస్‌వోల ఆధారంగా పోలీసులు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడటానికి వీల్లేదని పేర్కొంది. ఇప్పటికీ పీఎస్‌వోలను అనుసరిస్తే.. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులు కాని అధికారులు సైతం కోర్టుధిక్కరణకు పాల్పడిన వారవుతారని హెచ్చరించింది. రౌడీషీటు తెరవడం, దానిని కొనసాగించేందుకు ఉద్దేశించిన పీఎస్‌వోలోని భాగం, వ్యక్తులపై నిఘాకు సంబంధించిన స్టాండింగ్ ఆర్డర్స్ చెల్లుబాటు కావని ప్రకటించింది.
పిటిషనర్లపై నమోదు చేసిన రౌడీషీట్లను తక్షణం మూసివేయాలని ఆదేశించింది. చట్టం అనుమతి లేకుండా రౌడీషీటు తెరవొద్దని, వాటిని కొనసాగించొద్దని, వ్యక్తుల సమాచారం సేకరించొద్దని పోలీసులకు తేల్చిచెప్పింది. పీఎస్‌వో పేరు చెప్పి అనుమానితులు, నిందితుల ఇళ్లకు రాత్రిళ్లు పోలీసులు వెళ్లడానికి వీల్లేదంది. చట్టనిబంధనల మేరకు తప్ప.. వారి ఫొటోలు, వేలిముద్రలు తీసుకోవడానికి వీల్లేదంది. ఎన్నికలు, పండగలు, వారాంతపు సెలవుల్లో అనుమానితులు/ నిందితులను పోలీసుస్టేషన్‌కు పిలవకూడదంది.
వారిని ఠాణాల్లో వేచి ఉండేలా చేయవద్దని, స్టేషన్ పరిధి దాటి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలనే షరతు పెట్టొద్దని తేల్చిచెప్పింది. రౌడీషీట్ల నమోదు, కొనసాగింపును సవాలు చేస్తూ దాఖలైన 57 వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు శుక్రవారం ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చారు.
సరైన కారణాల్లేకుండా రౌడీలని ముద్ర వేస్తున్నారు:సుప్రీంకోర్టు, హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను విస్మరించి రౌడీషీట్లు తెరుస్తున్నారని న్యాయమూర్తి ఆక్షేపించారు. తగిన కారణాలు, విశ్వసనీయ సమాచారం లేకుండా చాలామందిపై రౌడీలుగా ముద్ర వేస్తున్నారన్నారు. లోక్‌అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకున్నా, ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టేసినా వారిపై రౌడీషీటు కొనసాగిస్తున్నారని తప్పుబట్టారు.