ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉప్పల్‌ జంట హత్య కేసు ఛేదన.. విచారణలో వెలుగులోకి విస్తుగొలిపే వాస్తవాలు - ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసు తాజా సమాచారం

Uppal Father and Son Murder Case Update: కష్టం లేకుండా ఉన్నత స్థాయికి చేరాలనేది ఒకరి కోరిక. మాయమాటలతో నమ్మించి డబ్బు సంపాదించాలనేది మరొకరి ఆలోచన. ఇలాంటి మనస్తత్వాలతో కూడిన ఇద్దరి వికృత చేష్టలు.. వారిలో ఒకరిని రాక్షసుడిలా మార్చగా.. మరొకరు అదే రాక్షసుడికి బలయ్యే పరిస్థితికి తెచ్చాయి. ఇటీవల హైదరాబాద్‌ ఉప్పల్‌లో చోటుచేసుకున్న జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్యోదంతంతో సంబంధమున్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Uppal Father and Son Murder Case
తండ్రికొడుకుల హత్య కేసు

By

Published : Oct 19, 2022, 10:41 AM IST

Uppal Father and Son Murder Case Update: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేరళ జంట హత్య కేసు మరువక ముందే.. అదే తరహాలో హైదరాబాద్‌లో గత శుక్రవారం జరిగిన తండ్రీకుమారుల హత్యోదంతం ఉప్పల్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణమని తొలుత పోలీసులు భావించినప్పటికీ.. పూర్తిస్థాయి విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పూజల పేరుతో ఓ జ్యోతిష్యుడు నోట్ల కట్టలతో ఆడిన ఆటలు తానే కాకుండా తన బిడ్డ ప్రాణాలను తీశాయి. అడ్డదారిలో గొప్పోడిని కావాలనుకున్న ఓ యువకుడు.. మాయమాటలు నమ్మి చివరకు తనతో పాటు మరికొందరిని ఊచలు లెక్కబెట్టే స్థితికి తెచ్చుకున్నాడు.

ఉప్పల్‌ హనుమసాయి కాలనీకి చెందిన నరసింహమూర్తి ఇంటి వద్దే ఉంటూ తెలిసిన వ్యక్తులకు జాతకాలు, పంచాంగం చెబుతుంటారు. ఈ క్రమంలోనే సరూర్‌నగర్ మండలం మామిడిపల్లికి చెందిన లిక్కి వినయ్‌ యోగేందర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఉప్పల్‌లో తన అమ్మమ్మ వారింటి వద్దే ఉండే యువకుడు.. తరచూ నరసింహమూర్తిని కలుస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే గత ఆరేళ్ల క్రితం వినయ్‌ ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేయగా.. పూజలు చేస్తే ఉద్యోగం వస్తుందని నరసింహమూర్తి డబ్బు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ నరసింహామూర్తికి సంబంధించిన మరో ఇద్దరు రూ.12 లక్షలు తీసుకున్నారు. అయినా ఫలితం లేకపోగా.. పెద్దఎత్తున డబ్బు ఖర్చు కావటంతో యువకుడు నరసింహమూర్తిపై కోపం పెంచుకున్నాడు. తన ముగ్గురు స్నేహితుల సహకారంతో నరసింహమూర్తిని అంతమొందించాలని ప్రణాళిక రూపొందించాడు.

స్నేహితుల సహకారంతో నరసింహమూర్తిని అంతమొందించాలని నిర్ణయించుకున్న వినయ్‌.. వారితో కలిసి జ్యోతిష్యుడి ఇంటి వద్దే ఉన్న బాయ్స్‌ హాస్టల్‌లో దిగారు. ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో ఎవరూ ఉండరని రెక్కీ ద్వారా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి ప్రవేశించి కూర్చీలో కూర్చున్న నరసింహమూర్తిపై గొడ్డలితో దాడి చేశారు. తండ్రి అరుపులు విని, బయటికి వచ్చిన కుమారుడు శ్రీనివాస్‌పైనా దాడిచేసి దారుణంగా హతమార్చారు.

నరసింహమూర్తి, అతని కుమారుడు శ్రీనివాస్‌ హత్యలకు ఆస్తి వివాదాలే కారణంగా తొలుత భావించిన పోలీసులకు.. పూర్తిస్థాయి విచారణలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు వినయ్ యోగేందర్‌రెడ్డితో పాటు సహకరించిన బాలకృష్ణారెడ్డి, జగదీశ్‌, రాము, శ్యామ్​సుందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు కార్తీక్‌, సుధాకర్‌రెడ్డి, లిక్కి సావిత్రిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details