తెలంగాణలో మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో వైఎస్ఆర్ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP President YS Sharmila) చేపట్టే నిరుద్యోగ దీక్ష ( YS Sharmila Hunger Strike On Unemployment) వద్ద అడ్డా కూలీలు ఆందోళనకు దిగారు. మేడిపల్లి కెనరా నగర్ బస్స్టాపు వద్ద ఉన్న కూలీల వద్దకు... ఆ పార్టీకి చెందిన రాఘవ రెడ్డి వెళ్లి సాయంత్రం 6 గంటల వరకు దీక్షలో ఉండాలని కోరినట్లు వెల్లడించారు. అలా వచ్చిన ప్రతిఒక్కరికి రూ.400 ఇస్తామని 50 మంది కూలీలను ఆర్టీసీ బస్సులో దీక్ష స్థలికి తీసుకొచ్చారు. వచ్చినప్పటినుంచి డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చూసిన వారికి నిరాశే ఎదురైంది. డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో కూలీలు ఆందోళనకు దిగారు. మీడియాతో మాట్లాడుతున్న కూలీలను... నాయకులు నచ్చచెప్పి అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లారు.
ఏమి లేదు సార్.. ఒకసారు వంద మంది ఆడోళ్లను తీసుకుని రమ్మన్నాడు. అయితే నేను 55 మందిని దీక్ష కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు వాళ్లను వద్దని అన్నారు. వీళ్లంతా డబ్బులు కోసం వచ్చారు. డబ్బులిస్తామంటేనే కూలీ మానుకుని వచ్చాము సార్.. ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటున్నారు. మేమేం చేయాలి. మా డబ్బులు మాకిప్పిస్తే మేము పోతాం సార్.. అటూ కూలీ పని పోయింది.. ఇటు డబ్బులు ఇవ్వట్లేదు.
- మహిళ అడ్డా కూలీలు