ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Police Real Estate: ఆ కేసులోనూ కొందరు పోలీసుల పాత్రపై ఆరోపణలు - Real Estate news

Police Real Estate Friendship: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మంగళవారం నాటి ఇబ్రహీంపట్నం జంట హత్యల కేసులోనూ కొందరు పోలీసులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూవివాదాల్లో పోలీసుల పాత్రపై తిరిగి చర్చ మొదలైంది.

Police Real Estate Friendship
జంట హత్యల కేసులో పోలీసులపై ఆరోపణలు

By

Published : Mar 3, 2022, 8:07 AM IST

Police Real Estate Friendship: స్థిరాస్తి దందాలో వేలు పెట్టే కొందరు పోలీసులు కోట్లకు పడగలెత్తుతున్నారు. నీకింత...నాకింత అన్నట్లుగా రియల్‌ వ్యాపారులతో పెనవేసుకుంటున్న దోస్తీ చాలాచోట్ల పోలీసు ప్రతిష్ఠను మసకబారుస్తోంది. వంత పాడితే కొంత, వదిలేస్తే ఇంకొంత.. అన్నట్లుగా వ్యవహరించే తీరును బట్టి వారి రేటు మారుతోంది. ఇలాంటివి బయటపడ్డప్పుడు మాత్రం రచ్చ జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మంగళవారం నాటి ఇబ్రహీంపట్నం జంట హత్యల కేసులోనూ కొందరు పోలీసులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూవివాదాల్లో పోలీసుల పాత్రపై తిరిగి చర్చ మొదలైంది.

శివారు పోస్టింగులకు డిమాండ్‌..

తెలంగాణలో ప్రస్తుతం సైబరాబాద్‌, సంగారెడ్డి పోలీస్‌ యూనిట్ల పరిధిలోని కొన్ని ఠాణాల పోస్టింగులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఆయా స్థానాల కోసం పలువురు అధికారులు అక్కడి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఓ ఠాణా పోస్టింగ్‌ కోసం గతంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ప్రయత్నాలు చేశారు. వారికి ఇవ్వడం ఇష్టం లేని ఉన్నతాధికారి మరో ఇన్‌స్పెక్టర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. చేరినప్పటి నుంచి ఆయన విశ్వరూపం ప్రదర్శించడం మెదలుపెట్టాడు. ఓ వివాదంలో బాధితుడిపైనే కేసు పెట్టడం రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో వేటు పడింది.

భూవివాదంలో సస్పెండ్‌ అయిన అధికారికి...

మంచి పోస్టింగులు తెచ్చుకునేందుకు కొందరైతే ఖర్చుకూ వెనుకాడటంలేదు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఓ జిల్లాలో కీలక పోస్టు దక్కించుకునేందుకు అధికారి తన ఇల్లు కూడా అమ్మినట్లు తెలుస్తోంది. గతంలో భూవివాదంలో తలదూర్చి సస్పెండ్‌ అయిన ఆ అధికారి ఇప్పుడు ఏకంగా ఇంటినే బేరం పెట్టి నచ్చిన పోస్టు దక్కించుకున్నట్లు పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉత్తర తెలంగాణలో గతంలో ఓ వివాదంలో చిక్కుకొని, కొన్ని నెలలుగా లూప్‌లైన్లో ఉన్న అధికారి అనూహ్యంగా మంచి పోస్టింగ్‌ దక్కించుకోవడమూ ఆ కోవలోనిదే. రాజధాని శివార్లలోని రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో అయితే కానిస్టేబుల్‌ పోస్టుకు కూడా మంచి డిమాండు ఉంది.

వసూళ్ల తీరు మారింది...

ఒకప్పుడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న వ్యాపార సంస్థల నుంచి చాలాచోట్ల నెలవారీ మామూళ్లు వసూలు చేసేవారు. ఇది వివాదంగా మారడం, అధికారులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుండటంతో రూటు మార్చారు. భూవివాదాలు ఆదాయ మార్గంగా మారాయి. ఒక్క గట్టి భూవివాదం సెటిల్‌చేస్తే నెలవారీ మామూళ్ల కంటే ఎక్కువ దక్కుతుండటంతో కొంతమంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు. అన్యాయం జరిగినా పలు సందర్భాల్లో బాధితులు బయటపడటంలేదు. ధైర్యంగా ఫిర్యాదు చేసినప్పుడో, ఏదైనా వివాదం బహిరంగమైనప్పుడో మాత్రమే ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు గ్యాంగ్‌స్టర్‌ నయీం వందలాది ఎకరాలను బలవంతంగా లాక్కున్నాడు. ఇందుకు అనేక మంది పోలీసులు కూడా సహకరించారు. ఎక్కడా ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. నయీం మరణించిన తర్వాత అనూహ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 290 కేసులు నమోదయ్యాయి.

పోస్టింగులకు ఖర్చూ మంచి పెట్టుబడే!

కొన్నిచోట్ల పోలీస్‌ పోస్టింగులకు అవసరమయిన ఖర్చు భరించేందుకు స్థిరాస్తి వ్యాపారులు ముందుకొస్తున్నారు. తమకు నచ్చిన అధికారులను తెచ్చుకుంటే భూదందాలకు మద్దతిస్తారన్న భరోసానే ఇందుకు కారణం. ఇటీవల రాజధాని శివార్లలో ఓ భూవివాదానికి మద్దతు తెలిపిన అధికారికి అంతక్రితం పెట్టుబడి పెట్టింది స్థిరాస్తి వ్యాపారులేనని తెలుస్తోంది. వరంగల్‌లో కొందరు పోలీసులను వ్యాపారులు సొంత ఖర్చుతో బ్యాంకాక్‌కు పంపడం కలకలం రేపింది.

మచ్చుకు కొన్ని ఉదంతాలిలా..

*ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అరెస్ట్‌ చేసింది. దర్యాప్తులో ఆయనకు పలు భూదందాల్లో ప్రమేయమున్నట్లు, ఆస్తుల విలువ రూ.కోట్లలో ఉన్నట్లు తేలింది. హైటెక్‌సిటీలోని విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన అనుచరుల పేరుతో మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకున్నట్లు వెల్లడైంది.

*సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని రూ.కోట్ల విలువైన ఓ భూవివాదంలో తలదూర్చి, మూడో వ్యక్తికి దాన్ని అప్పగించాలని ప్రయత్నించారన్న ఆరోపణలపై నార్సింగి సీఐ గంగాధర్‌, ఎస్సై కె.లక్ష్మణ్‌లను కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సస్పెండ్‌ చేశారు.

*ఆర్సీపురంలోని ఓ స్థల వివాదంలో తల దూర్చి బెదిరింపులకు పాల్పడినట్లు అదనపు డీసీపీ పులేందర్‌రెడ్డిపై గతంలో కేసు నమోదైంది.

*వ్యాపారి చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేశ్‌రెడ్డికి సహకరించారనే ఆరోపణలతో ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబు గతంలో సస్పెండ్‌ అయ్యారు. రాకేశ్‌రెడ్డి భూదందాలకు వీరు సహకరించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

*గ్యాంగ్‌స్టర్‌ నయీంతో అంటకాగారంటూ రాష్ట్రవ్యాప్తంగా 14 మంది పోలీస్‌ అధికారులపై అప్పట్లో వేటు వేశారు. తర్వాత వారంతా విధుల్లో చేరినా ఇంకా దర్యాప్తు ముగియలేదని డీజీపీ రెండు నెలల క్రితం ప్రకటించారు.

*న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కనపెట్టి, సివిల్‌ వివాదంలో తలదూర్చిన ఆరోపణలపై చౌటుప్పల్‌ సీఐ వెంకన్నగౌడ్‌, ఎస్సై నర్సయ్యలు సస్పెండ్‌ అయ్యారు.

ఇదీ చదవండి:వై.ఎస్. వివేకాను కొట్టి... ఆ లేఖ రాయించారు: సీబీఐ

ABOUT THE AUTHOR

...view details