అడుగడుగునా బారికేడ్లు.. దారి పొడవునా ఇనుప కంచెలు.. ప్రతి పల్లెలోనూ వందల మంది పోలీసులతో కవాతులు..ఇంటి నుంచి కాలు బయటకు పెట్టటమే నేరమన్నట్లుగా తీవ్ర స్థాయి అణచివేతలు.. ఊరు దాటి ముందుకెళ్లనీయకుండా నిర్బంధాలు.. ఈ దమనకాండ దృశ్యాలు, చిత్రాలను ఏవీ తీయకుండా, చూపించకుండా.. ఎక్కడికక్కడ మీడియాపై ఉక్కుపాదం మోపుతూ చర్యలు.. ఇలా రాజధాని అమరావతి ఉద్యమం ఆదివారం నాటికి 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా తలపెట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానానికి’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు. వేల మందితో నిర్వహిస్తున్న ప్రభుత్వ, అధికార పార్టీ నాయకుల సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలకు కళ్లు మూసుకుని అనుమతిస్తున్న పోలీసులు.. అమరావతి రైతులు న్యాయదేవతకు, ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామికి గోడు వెళ్లబోసుకునేందుకు అనుమతి ఇవ్వమని కోరితే కొవిడ్ ఆంక్షలను సాకుగా చూపి ఇవ్వలేదు. ఆదివారం తెలవారకముందే 29 రాజధాని గ్రామాల్లో దాదాపు 3000 మంది పోలీసులను మోహరించారు. 100కుపైగా చెక్‌పోస్టులు పెట్టారు. ర్యాలీలో పాల్గొనేందుకు బయల్దేరిన వారిని అడుగడుగునా అడ్డుకున్నారు. ఆ పల్లెల ప్రజలెవరూ బయటకు రాకుండా.. వేరే ప్రాంతాల నుంచి ఆ ఊళ్లలోకి ఎవరూ ప్రవేశించకుండా దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో తోపులాటలు చోటుచేసుకుని రాజధాని రైతు కట్టా రాజేంద్రకు కాలు విరిగిపోగా, మరో మహిళా రైతు పొత్తి కడుపుపై ఓ పోలీసు కాలితో తన్నారు. ఓ యువతి గొంతు వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ గట్టిగా పట్టుకోవడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పలువురిని గోళ్లతో రక్కేశారు. మహిళలనీ చూడకుండా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్లకు తరలించారు. మొత్తంగా రాజధానిలో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అయినా ఆంక్షల్ని, నిర్బంధాల్ని, ముళ్లకంచెల్ని దాటుకుని కొందరు రైతులు హైకోర్టు సమీపానికి, మంగళగిరి గుడికి చేరుకుని లక్ష్యాన్ని సాధించారు.
వివిధ రాజధాని గ్రామాల నుంచి తుళ్లూరు శిబిరానికి చేరుకున్న మహిళలు, రైతులు... అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన పోలీసుల కళ్లుగప్పేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక్కసారిగా శిబిరం నుంచి బయటకు వచ్చి... ఏం జరుగుతోందో పోలీసులు గ్రహించే లోపే, మూడు బృందాలుగా విడిపోయి తలోదిక్కుకూ వేగంగా కదిలారు. పెద్ద సంఖ్యలో మహిళలు, కొందరు రైతులతో కూడిన ఒక బృందం హైకోర్టు వైపు పరుగులు తీసింది. తేరుకున్న పోలీసులు వారిని వెంబడించి, రెండు మూడు చోట్ల తాళ్లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పోలీసు వలయాన్ని ఛేదించుకుని వారు పొలాల వెంట పరుగులు తీశారు. వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు హైకోర్టు ఎదురు రోడ్డులోకి చేరుకొని నినాదాలు చేశారు. వారిలో పిల్లలు, వృద్ధులూ కూడా ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయానికి కొందరు రైతులు పోలీసుల నిర్బంధాలను దాటుకుని మంగళగిరి చేరుకున్నారు. మొదట వారు కొండపై ఉన్న పానకాలస్వామి గుడికి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం జరుగుతుండగా... కొందరు వాళ్ల కళ్లుగప్పి విడి విడిగా సాధారణ భక్తుల్లా కొండ దిగువన ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ వారు జై అమరావతి అని నినాదాలు చేయడంతో... ఉలిక్కిపడిన పోలీసులు వారిని వేగంగా చుట్టుముట్టారు. ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా రైతులు... ‘‘సీఎం డౌన్, డౌన్..., ఇదేమి రాజ్యం... ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం, పోలీసుల దౌర్జన్యం నశించాలి...’’ అంటూ నినాదాలు చేశారు.
ఎమర్జెన్సీ రోజులను తలపించేలా..!
రాజధాని ఉద్యమం ఆరు వందల రోజులకు చేరుకున్న సందర్భంగా అమరావతి గ్రామాల ప్రజలు, రాజధానికి భూములిచ్చిన రైతులు చేపట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా మీడియాపై గుడ్లురిమారు..! బయటి నుంచి ఒక్క మీడియా ప్రతినిధి రాజధాని గ్రామాల్లోకి అడుగుపెట్టినా బాగోదని, కెమేరాలు బయటకు తీస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజధాని గ్రామాల్లోకి మీడియా ప్రతినిధులెవర్నీ అడుగు పెట్టనివ్వవద్దని పై నుంచి తమకు ఆదేశాలున్నాయని చెప్పారు. పోలీసులు తమను ఆటంకపరుస్తున్న, అరెస్టులు చేస్తున్న దృశ్యాల్ని సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న రాజధాని ప్రజల్నీ అడ్డుకున్నారు. కొందరి చేతుల్లోంచి ఫోన్లు లాగేసుకున్నారు.
నేతలపై నిఘా
రాజధాని ప్రజల ఉద్యమానికి మద్దతిచ్చేందుకు తరలివస్తారన్న అనుమానం ఉన్న నాయకులపై పోలీసులు ముందు నుంచే నిఘా పెట్టారు. ఆదివారం ఉదయమే వారి నివాసాల వద్ద మోహరించారు. ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న నాయకుల కదలికలను వారి సెల్ఫోన్లను ట్రాక్ చేస్తూ పసిగట్టారు. రాజధాని గ్రామాల ప్రజలు రోజూ నిరసనలు తెలిపే శిబిరాలన్నిటినీ ఉదయమే ముట్టడించారు. వివిధ గ్రామాలకు చెందిన ఉద్యమకారులు రెండు మూడు ప్రధాన శిబిరాల వద్దకు చేరుకొని అక్కడి నుంచి న్యాయస్థానం సమీపానికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. వివిధ పార్టీల నాయకుల్ని, ప్రజల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలు పార్టీల నాయకులు, ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకులు సహా మొత్తం మీద 377 మందిని పోలీసుస్టేషన్లకు తరలించారు. వారిలో పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే రాజధానిలోకి వచ్చే రహదారులన్నీ దిగ్బంధించారు. రాజధానిలోని ఒక గ్రామం నుంచి మరో గ్రామానికీ ప్రజలు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆటోలకూ నోటీసులిచ్చారు. అత్యవసర పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళాల్సి ఉంటే... ఆధార్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తేనే పంపించారు. రాజధాని గ్రామాల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్ని అడ్డుకుని, ప్రయాణికుల్ని పూర్తిగా తనిఖీ చేశాకే పంపించారు.
వారిపై సానుకూలత..
ఒక పక్క అమరావతి పరిరక్షణకు శాంతియుత ర్యాలీ తలపెట్టిన వారిపై ఉక్కుపాదం మోపిన పోలీసులు... మూడు రాజధానులకు అనుకూలంగా పోటీ శిబిరం నిర్వహిస్తున్న వారి విషయంలో సానుకూలంగా వ్యవహరించారు. శిబిరంలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఆటోల్లో వచ్చిన వారినీ అనుమతించారు. ఒకే ఆటోలో 10 మందికిపైగా వచ్చినా... పోలీసులకు కొవిడ్ నిబంధనలు గుర్తు రాలేదు. మూడు రాజధానులకు మద్దతుగా మంగళగిరి నుంచి హైకోర్టు వరకు ర్యాలీ నిర్వహించేందుకు.... ఆటోల్లో మంగళగిరి వస్తున్న వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు, వారికి సున్నితంగా నచ్చజెప్పి, కాసేపటికే అవే ఆటోల్లో రాజధానిలో వారు నిర్వహిస్తున్న శిబిరానికి పంపించేశారు.
గర్జించిన మహిళలు..!
రాజధాని ఉద్యమాన్ని మొదటి నుంచీ ముందుండి నడిపిస్తున్న మహిళలు... ఆదివారం కూడా పోలీసు నిర్బంధాలను అదే పట్టుదలతో ఎదుర్కొన్నారు. వివిధ రాజధాని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హైకోర్టు సమీపానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. కొందరు మహిళలు మంగళగిరి వెళ్లేందుకూ బయల్దేరారు. మండే ఎండనూ, ఇనుప కంచెల్ని, ముళ్ల పొదల్నీ లెక్క చేయకుండా... ర్యాలీలో పాల్గొనేందుకు కదం తొక్కారు. తమను అడ్డుకుని, దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని నిలదీశారు. వారిని బలవంతంగా కాళ్లు చేతులు పట్టుకుని తీసుకెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. ఆ క్రమంలో వారు పోలీసుల్ని వీలైనంత వరకు ప్రతిఘటించారు. పెద్ద ఎత్తున ఉద్యమ నినాదాలు చేశారు. మందడంలో ఒక యువతిని... ఒక మహిళా కానిస్టేబుల్ గట్టిగా గొంతునొక్కడంతో... అక్కడి మహిళలంతా తిరగబడ్డారు. మహిళా పోలీసులు దుస్తులు వేసి, పోలీసులు కానివార్ని తీసుకొచ్చి తమపై దాష్టీకం చేస్తున్నారని ఆరోపించారు. ఆ మహిళా కానిస్టేబుల్ గుర్తింపు కార్డు చూపించాలని గట్టిగా నిలదీశారు. ‘మా ఊర్లో మమ్మల్నే ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి మా గొంతు నొక్కేసి, మీరు మాత్రం గుర్తింపు కార్డు ఎందుకు చూపించరు? పోలీసు దుస్తుల్లో బయటి వాళ్లు రాత్రికి రాత్రే వచ్చి మమ్మల్ని మర్డర్ చేసి పోతే ఏంటి పరిస్థితి’ అని నిలదీశారు. కొన్ని గ్రామాల్లో... మొక్కు తీర్చుకునేందుకు మహిళలు గ్రామ దేవత గుడికి వెళుతున్నా పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు గట్టిగా నిలదీయడంతో... పోలీసు పహారాలో వారిని గుడికి తీసుకెళ్లారు.
గర్జించిన మహిళలు