రేపు అసెంబ్లీ ముట్టడికి అమరావతి ఐకాస పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం నేతలకు నోటీసులు ఇచ్చారు. 149 CRPC చట్ట ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగే కార్యక్రమాలు చేపడుతున్నట్లు... తమ వద్ద సమాచారం ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలైనా శాంతియుతంగా చేసుకోవాలని, శాంతికి భంగం కలగకుండా నిరసనలు తెలుపుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు .
అసెంబ్లీ సమావేశాల సమయంలో నోటీసుల జారీపై తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు వచ్చి తనకు నోటీసు ఇచ్చారని.. నిరంతరం తనను అనుసరిస్తున్నారని తెదేపా నేత అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీకి వెళ్లే సభ్యులకు నోటీసులు ఇవ్వాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులుకు నోటీసులు ఇచ్చారు.