Secunderabad riots case update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం వెనక అదృశ్య శక్తుల పాత్ర ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆందోళనకారులు వచ్చీరాగానే స్టేషన్లో ఏది ఎక్కడుందో బాగా తెలిసినట్లు ప్రవర్తించడం, వ్యూహాత్మక ప్రాంతాలను కట్టడి చేయడాన్నిబట్టి స్టేషన్ పరిస్థితులు బాగా తెలిసిన వ్యక్తులెవరైనా వారికి సహకరించి ఉంటారని బలంగా విశ్వసిస్తున్నారు. ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం తాజాగా రాష్ట్ర పోలీసుశాఖను కోరినట్లు తెలుస్తోంది.
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా గత శుక్రవారం నిరుద్యోగులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా స్టేషన్‌లోకి చొచ్చుకొచ్చిన దాదాపు రెండు వేల మంది.. వచ్చీరాగానే రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చేలోపే భారీ నష్టం కల్గించారు. ఈ ఊహించని ఘటనలో వారు అనుసరించి విధానం మాత్రం పోలీస్ అధికారులను విస్మయానికి గురిచేసింది. "ఆందోళనలో పాల్గొన్న వారంతా రకరకాల ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వాట్సప్ సంభాషణల ద్వారానే అనుకున్న సమయానికి ఒక్కచోటుకు వచ్చారు. అందరూ స్టేషన్‌కు చేరుకున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత బృందాల వారీగా విడిపోయి విధ్వంసానికి దిగారు.