వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంటి నిర్మాణంలో మార్పులు చేసుకుంటుంటే పీవీపీ, ఆయనతో పాటు 15 మంది అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని విక్రమ్ కైలాశ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ‘‘బంజారాహిల్స్ రోడ్ నంబరు-14లో ప్రేమ్ పర్వత్ విల్లాస్ పేరుతో పీవీపీ గతంలో విల్లాలు విక్రయించారు. ఒక విల్లాను నేను 15 నెలల కిందట కొన్నాను. ఆరు నెలల కిందట టెర్రస్ నిర్మాణ పనులను ప్రారంభించగా.. పీవీపీ ఫోన్ చేసి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు. మాట కాదంటే ఇంటినే కూల్చేస్తానని బెదిరించారు. అప్పుడు తాత్కాలికంగా పనులు ఆపేశాను. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో మంగళవారం తిరిగి పనులను ప్రారంభించా. సమాచారం తెలుసుకున్న పొట్లూరి బుధవారం ఉదయం 9.30 గంటలకు పదిహేను మందితో వచ్చారు. అరుపులు, కేకలతో బెదిరించారు. ఇంట్లోకి ప్రవేశించి టెర్రస్‌పైన నిర్మాణాలను కూల్చివేశారు’’ అని కైలాశ్ పోలీసులకు వివరించారు.
ఆకృతులు మార్చవద్దని నిబంధనల్లో ఉంది: పీవీపీ
విల్లాలు విక్రయించినప్పుడు ఎలాంటి రూఫ్ టాప్‌ల నిర్మాణాలు చేపట్టవద్దని, నిర్మాణ ఆకృతులు మార్చవద్దని నిబంధనల్లో ఉన్నట్లు పీవీపీ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. కైలాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీవీపీపై చొరబాటు, బెదిరింపులు, ధ్వంసం చేయడంకింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ కేఎస్‌రావు తెలిపారు. బుధవారం 11 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు.. ఇవాళ మరోసారి హాజరు కావాలని సూచించారు. పీవీపీని అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చడమా... లేక నోటీసులు జారీ చేయడమా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.