ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Gudivada Casino Issue: భాజపా నేతల గుడివాడ పర్యటన ఉద్రిక్తం.. పోలీసుల వైఖరిపై మండిపాటు - ap bjp latest news

భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు
భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు

By

Published : Jan 25, 2022, 2:04 PM IST

Updated : Jan 26, 2022, 4:18 AM IST

14:02 January 25

గుడివాడ వెళ్తున్న భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు

భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా గుడివాడలో భాజపా తలపెట్టిన సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. గుడివాడలో భాజపా నిర్వహించిన ముగ్గులు తదితర సంప్రదాయ పోటీల విజేతలకు బహుమతులు అందించేందుకు రాష్ట్ర నేతలు అక్కడికి బయలుదేరారు. విజయవాడనుంచి మంగళవారం మధ్యాహ్నం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపీ సీఎం రమేశ్‌, నేతలు భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. వీరి వాహనాలు ఉంగుటూరు మండలం నందమూరు అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడ వెళ్లడానికి అనుమతి లేదని, వెనక్కి వెళ్లాలని కోరారు. దీంతో వారు వాహనాలను అక్కడే వదిలేసి పాదయాత్రగా గుడివాడకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉయ్యూరు రూరల్‌ స్టేషన్‌ పరిధిలోని కలవపాముల వద్ద మరోమారు పోలీసులు భాజపా శ్రేణులను అడ్డగించారు. గుడివాడలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని వారు నేతలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘మా పార్టీ కార్యక్రమానికి వెళ్తున్నాం. మీ అనుమతి కావాలా? గుడివాడలో ఏమైనా 144 సెక్షన్‌ ఉందా? పోటీల్లో విజేతలకు బహుమతులిచ్చేందుకు వెళితే అడ్డుకోవడమేంటి?’ అంటూ సోమువీర్రాజు, సీఎం రమేశ్‌ నిలదీశారు. కొడాలి నాని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినదించారు. దీంతో తోపులాటలు జరిగాయి. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు కొందరు కార్యకర్తలను ఈడ్చేశారు. ఈ క్రమంలో సోమువీర్రాజు రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో సోమువీర్రాజు, ఆదినారాయణరెడ్డి తదితర నాయకులు కొందరిని ట్రాలీ ఆటోలోకి ఎక్కించి ఉంగుటూరు స్టేషన్‌కు తరలించారు. సీఎం రమేష్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు తదితరులను తోట్లవల్లూరు స్టేషనుకు తీసుకెళ్లారు. అరెస్టు చేసిన వీరిని సాయంత్రం 6.45కు విడిచిపెట్టారు.

క్యాసినో డ్యాన్సులంటేనే కొడాలికి ఇష్టం

‘సంక్రాంతి అంటే ఎలా ఉంటుందో కొడాలికి, సీఎంకు తెలపాలనే గుడివాడకు వెళ్లాలనుకున్నాం. మంత్రి కొడాలికి క్యాసినో డ్యాన్సులంటేనే ఇష్టం. ఆయన్ను తక్షణమే మంత్రివర్గంనుంచి బర్తరఫ్‌ చేయాలి. వైకాపా రూలింగ్‌ పార్టీ కాదు.. ట్రేడింగ్‌ పార్టీ. చంద్రబాబు తోక పట్టుకుని వేలాడే పార్టీ మాది కాదు. మమ్మల్ని విమర్శిస్తే గట్టిగా బుద్ధి చెబుతాం. మేం ఏ పార్టీతోనూ లేము. వైకాపావారు ఎవరి పక్షమో తేల్చుకోవాలి’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. పోలీసులకు తెలియకుండా గుడివాడలో 3రోజులపాటు క్యాసినో ఎలా జరుగుతుందని ఎంపీ సీఎం రమేశ్‌ ప్రశ్నించారు. ‘ఇందులో పోలీసుల వాటా ఎంత? చట్ట నిబంధనలను అతిక్రమించిన పోలీసులపై పార్లమెంటులో ప్రివిలేజ్‌ మోషన్‌ ప్రవేశపెడతా. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం’ అని వెల్లడించారు. భాజపా నేతల అరెస్టు పిరికిపంద చర్య అని పార్టీ రాష్ట్ర నేతలు ఆదినారాయణరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు.

బెదిరించి.. స్వాగత ద్వారాల తరలింపు

గుడివాడ పట్టణ ప్రారంభంలోని ఓ కళాశాల కల్యాణమండపంలో తొలుత బహుమతి ప్రదాన వేదికను ఏర్పాటుచేశారు. సోమవారం అర్ధరాత్రి భాజపా కార్యకర్తలు సభ స్వాగత ద్వారాలు కడుతున్నారు. ఇంతలో గుర్తుతెలియని 20 మంది వాహనాలపై వచ్చి కార్యకర్తలను బెదిరించి వాటిని తీసుకెళ్లారని భాజపా నాయకులు ఆరోపించారు. దీంతో కార్యక్రమాన్ని పట్టణంలోని భాజపా నేత జి.రాజబాబు నివాసం వద్ద ఏర్పాటుచేశారు. ఎమ్మెల్సీ మాధవ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసవర్మ బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.

ప్రివిలేజ్ మోషన్ సమర్పిస్తా - సీఎం రమేశ్

"పోలీసులపై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ సమర్పిస్తా. ఏపీ పోలీసులు రూల్ ఆఫ్ లా అతిక్రమిస్తున్నారు: సి.ఎం. పోలీస్‌ వ్యవస్థను దిగజార్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గుడివాడ డీఎస్పీకి తెలియకుండా క్యాసినో జరిగిందా? గుడివాడ డీఎస్పీనే విచారణాధికారిగా వేస్తే ఇంకేముంది? క్యాసినోలో పోలీసులు, నాయకులు ఎవరి వాటా ఎంతో తేలుస్తాం. గుడివాడలో మేం చేయాల్సిన కార్యక్రమం చేసి తీరుతాం" - సీఎం రమేశ్‌ , భాజపా ఎంపీ

పవన్ ట్వీట్...

భాజపా నేతల అరెస్టు అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వాస్తవాల కోసం క్షేత్రస్థాయిలో పర్యటించడం పార్టీల బాధ్యతని... గుర్తుచేశారు. గుడివాడ పరిణామాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పవన్‌ డిమాండ్ చేశారు..

ఇదీచదవండి:ముంద్రా పోర్టులో మళ్లీ డ్రగ్స్ కలకలం.. 25వేల కేజీలు సీజ్!

Last Updated : Jan 26, 2022, 4:18 AM IST

ABOUT THE AUTHOR

...view details