ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

13 ఏళ్ల పగ.. తండ్రి హత్యకు తనయుడి ప్రతీకారం.. రూ.30లక్షలతో సుపారీ

13 ఏళ్ల కిందట తండ్రిని హతమార్చిన వ్యక్తిని.. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి ఓ ముఠాతో హత్య చేయించిన ఘటనలో ప్రధాన నిందితుడు సహా ఆరుగురిని తెలంగాణలోని మల్కాజిగిరి ఎస్‌వోటీ, జవహర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, కత్తులు, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈ వ్యవహారం ఎలా బయటపడిందంటే..

13 years Revenge
ప్రాణం తీసిన ఏళ్లనాటి పగ

By

Published : Jul 21, 2022, 12:30 PM IST

రూ.30 లక్షల సుపారీ ఇచ్చి ఓ ముఠాతో... 13 ఏళ్ల కిందట తండ్రిని హతమార్చిన వ్యక్తిని హత్య చేయించిన ఘటనలో ప్రధాన నిందితుడు సహా ఆరుగురిని తెలంగాణలోని మల్కాజిగిరి ఎస్‌వోటీ, జవహర్‌నగర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, కత్తులు, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మహేశ్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు.

కీసర మండలం దమ్మాయిగూడ పీఎస్‌రావు నగర్‌కు చెందిన ఎస్‌.శ్రీకాంత్‌రెడ్డి(33) వ్యాపారి. ఇతని తండ్రి జంగారెడ్డికి.. కాప్రా మండలం చక్రీపురం సీతారాంనగర్‌కు చెందిన రఘుపతి(45)కి భూతగాదాలు ఉన్నాయి. జంగారెడ్డి తనను నలుగురిలో అవమానించాడన్న కోపంతో రఘుపతి 2009లో కొందరితో కలిసి అతడిని హత్య చేశాడు. ఇది మనసులో పెట్టుకున్న జంగారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్ఢి... రఘుపతిని హత్య చేయించేందుకు మూడు నెలల క్రితం ప్రణాళిక రచించాడు. కర్ణాటక షిమోగా జిల్లాలో ఉంటున్న తన తండ్రి స్నేహితుడు వ్యాపారి మంజునాథ్‌(45)ను కలిసి విషయం చెప్పాడు. అతడు రిజ్వాన్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. రఘుపతిని హత్య చేసేందుకు రిజ్వాన్‌తో రూ.30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆరుగురు సభ్యుల ముఠా ఈనెల 15న ఉదయం నుంచి రఘును అనుసరించారు. అదే రోజు రాత్రి 8:30కి రఘు తన మిత్రులు ప్రసాద్‌, బాబుతో కలిసి దమ్మాయిగూడలోని ఓ మద్యం దుకాణం సమీపంలో ఆగారు. అదే అదనుగా వేట కొడవళ్లు, కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో ప్రసాద్‌కు సైతం గాయాలయ్యాయి. శ్రీకాంత్‌రెడ్డి వారిని మార్గమధ్యంలో కలిసి రూ.30 లక్షలు అందజేశాడు.

బయటపడిందిలా..:రఘు భార్య స్వర్ణలత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శ్రీకాంత్‌రెడ్డి, అతని మిత్రుడు.. కాప్రా మండలం సాయిబాబానగర్‌లో ఉంటున్న కావడి రాజేశ్‌ (29) హత్య చేసినట్లు పేర్కొంది. దీంతో పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా పది మంది హస్తం ఉందని తేలింది. మంజునాథ్‌(45), మహ్మద్‌ సాదిక్‌(24), ఇస్మాయిల్‌(20), సమీర్‌ఖాన్‌(23)లను అరెస్టు చేశారు. శ్రీకాంత్‌రెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. రిజ్వాన్‌, భవిత్‌, సుమిత్‌, నేతలు పరారీలో ఉన్నారు. సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌, కుషాయిగూడ ఏసీపీ సాధనా రష్మి పెరుమాల్‌ పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details