Revanth Reddy: బాసర ట్రిపుల్ ఐటీకీ వెళ్లిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పిన రేవంత్‌రెడ్డి ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. కాలినడకన వెళ్లిన ఆయన గోడ దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించారు. ఈలోపు అక్కడకు చేరుకున్న పోలీసులు రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం లోకేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల చేస్తున్న ఆందోళన నాలుగోరోజు కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీలు.. విద్యార్థుల ఆందోళనలకు మద్దతు పలికారు. ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. అయితే కామారెడ్డి పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టు చేశారు.
గోడ దూకి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి వెళ్లిన రేవంత్‌రెడ్డి
అసలేం జరిగిందంటే..నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో యాజమాన్య నిర్లక్ష్యంపై విద్యార్థులు గళమెత్తారు. సుమారు ఆరు వేల మంది విద్యార్థులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. రెండురోజుల కిందట విద్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి విద్యాలయానికి శాశ్వత ఉపకులపతి నియామకం జరపకపోవడం, మూడేళ్లుగా ల్యాప్‌టాప్‌ల సరఫరా, ఏకరూప దుస్తుల పంపిణీ లేకపోవడం, నాణ్యమైన భోజనం పెట్టకపోవడంపై ధర్నా చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా స్పందన లేదన్నారు. సీఎం కేసీఆర్ తమ విద్యాలయానికి రావాలని డిమాండ్ చేశారు. సమస్యలపై స్పందించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.
ఇదీ చదవండి:Agnipath Agitation: సికింద్రాబాద్‌లో ఆందోళన ఉద్రిక్తం.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు