Mahesh Bank Server hacking Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన మహేశ్‌బ్యాంక్‌పై సైబర్‌దాడి కేసులో పోలీసులు ఎట్టకేలకు ఇద్దరు హ్యాకర్లను గుర్తించారు. పంజాబ్‌లోని పాటియాలలో నివాసముంటున్న బల్వీందర్ సింగ్, డేవిడ్ కుమార్‌లను నాలుగు రోజుల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి హ్యాకర్లకు సంబంధించిన విషయాలు రాబట్టారు. వీరిద్దరూ హ్యాకర్లకు సిమ్‌కార్డులు సరఫరా చేశారు. సిమ్‌కార్డుల ద్వారా రివర్స్ ఇన్వెస్టిగేషన్ పద్ధతిలో పరిశోధన కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల్లో వీరి వివరాలు తెలిసే అవకాశాలున్నాయని ఒక పోలీస్ ఉన్నతాధికారి ‘ఈనాడు- ఈటీవీ భారత్’కు తెలిపారు.
ఇమ్రాన్ దుబాయి వెళ్లినా..ముంబయిలో ఉంటున్న ఇమ్రాన్ ధ్యాన్‌సే ఈ ఏడాది జనవరిలో ఓ నైజీరియన్‌ను కలిశాడు. కమీషన్ ఆశ చూపి జనవరి 23, 24 తేదీల్లో మహేశ్ బ్యాంక్‌పై సైబర్‌దాడికి పాల్పడ్డ నిందితులు ఇమ్రాన్ ఖాతాలో రూ.52 లక్షలు జమ చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్ దుబాయికి వెళ్లాడు. పోలీసులు అతడి బ్యాంక్ ఖాతాలోని రూ.52 లక్షలను స్తంభింపజేశారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పదిహేను రోజుల క్రితం ముంబయికి రాగానే.. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు.