తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి చెక్‌పోస్టు వద్ద.. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రహదారిపైకి వచ్చిన ఓ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహనదారుడు పోలీసులపై విరుచుకుపడ్డాడు. తాను పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరుడినంటూ.. రహదారిపై నానా హంగామా చేశాడు.
చర్లబుత్కూర్ గ్రామానికి చెందిన దాసరి అంజిరెడ్డి.. లాక్‌డౌన్ నిబంధనలు లెక్క చేయకుండా కారులో రహదారిపైకి వచ్చాడు. దుబ్బపల్లి చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్న పోలీసులు.. నియమాలకు విరుద్ధంగా వాహనాన్ని వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యే సోదరుడినంటూ..
ఆగ్రహానికి గురైన అంజిరెడ్డి.. వారితో వాదనకు దిగారు. తాను పెద్దపల్లి ఎమ్మెల్యే తమ్ముడినంటూ వారిపై విరుచుకు పడ్డారు. అంతటితో ఆగక.. తాను ఓ రైతునంటూ, వ్యవసాయదారుడిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని రహదారిపై రచ్చ రచ్చ చేశాడు. రైతులు పెళ్లికి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. ఎండనకా, వాననకా కష్టపడే రైతులకు పోలీసులు ఇచ్చే మర్యాదా ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే కేసు పెట్టుకోండంటూ మండిపడ్డారు.