ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: మత్యుబావిలో 9 మృతదేహాలు... హత్యా... ఆత్మహత్యలా? - GORREKUNTA DEATH MYSTERY

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులోని బావిలో 9 మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. ఇవి హత్యలా? ఆత్మహత్యలా? పోలీసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులకు సవాల్​గా మారిన గొర్రెకుంట బావి మృతదేహాల కేసు
పోలీసులకు సవాల్​గా మారిన గొర్రెకుంట బావి మృతదేహాల కేసు

By

Published : May 23, 2020, 8:36 AM IST

పోలీసులకు సవాల్​గా మారిన గొర్రెకుంట బావి మృతదేహాల కేసు

పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం కుటుంబంతో వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటకు వచ్చి స్థిరపడ్డాడు. వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌లో అద్దె ఇంట్లో ఉండి కూలి పనులు చేసేవాడు. కొద్ది నెలల క్రితం గన్నీ సంచుల తయారీ పరిశ్రమలో పనికి చేరి, అక్కడే కుటుంబంతో నివసిస్తున్నాడు. మక్సూద్‌(55), అతడి భార్య నిషా(48), కుమార్తె బుస్రా(22), మూడేళ్ల మనవడు బబ్లూ మృతదేహాలను గురువారం రాత్రి వెలికితీశారు. మక్సూద్‌ కుమారులు షాబాద్‌ అలం(21), సోహెల్‌ అలం(18) మృతదేహాలతో పాటు, బిహార్‌కు చెందిన యువకులు శ్రీరాం(21), శ్యాం(21), పశ్చిమబెంగాల్‌కు చెందిన షకీల్‌(30) మృతదేహాలు శుక్రవారం బావిలో కనిపించాయి. షకీల్‌ కరీమాబాద్‌లో నివసిస్తూ గన్నీ సంచుల తయారీ పరిశ్రమలోనే పనిచేస్తున్నాడు. ఒకేసారి తొమ్మిది మంది బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడం సాధ్యం కాదని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఎవరో విషప్రయోగం చేసి, వారు అచేతన స్థితిలో ఉండగా, బావిలో పడేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వరంగల్‌ కమిషనరేట్‌లోని ఈస్ట్‌ జోన్‌ పోలీసులు బృందాలుగా విడిపోయి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

రాత్రి వేడుకలు... తెల్లారేసరికి మరణాలు

మక్సూద్‌ కుమారుడు షాబాద్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాత్రి ఆ కుటుంబం వేడుకలు చేసుకుంది. పరిశ్రమలోని భాగస్వామి భాస్కర్‌తో రాత్రి 9.30 గంటల వరకు మక్సూద్‌ ఫోన్‌లో మాట్లాడాడు. పుట్టిన రోజు వేడుకల్లో ప్రత్యేక వంటకాలతో అందరూ కలిసి భోజనం చేశారు. గురువారం తెల్లవారేసరికి ఇంట్లో ఎవరూ లేరు. ఉదయం అక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్‌ మొగిలి పనివారెవరూ కనిపించడంలేదని పరిశ్రమలో భాగస్వామి భాస్కర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన మరో భాగస్వామి సంతోష్‌, ఆటోడ్రైవరుతో కలిసి వచ్చి వెతికారు. మక్సూద్‌ కుటుంబం గతంలో నివసించిన ప్రాంతానికి వెళ్లినా ఆచూకీ లభించలేదు. మళ్లీ ముగ్గురూ గోదాం వద్దకు వచ్చి భవనం పైకి ఎక్కి పరిశీలిస్తుంటే బావిలో నాలుగు శవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సన్నిహితుడి విషయంలో ఘర్షణ

బుస్రాతో కరీమాబాద్‌కు చెందిన యాకూబ్‌ అనే వ్యక్తి సన్నిహితంగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయంలో బుస్రాకు, ఆమె తల్లికి తరచూ గొడవలు జరిగేవని సమాచారం. అక్కడే నివసిస్తున్న బిహార్‌ యువకులు వీరి విషయంలో జోక్యం చేసుకోవడంతో యాకూబ్‌ వచ్చి వారితో ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యాకూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

సెల్‌ఫోన్లు ఏమైనట్లు?

మృతి చెందిన వ్యక్తులందరి సెల్‌ఫోన్లు కనిపించలేదు. అవి స్విచాఫ్‌ అయ్యాయి. మృతుల ఆధార్‌ కార్డులు, వారు వినియోగించిన ఎనిమిది సెల్‌ఫోన్ల నంబర్లను సేకరించారు. అవి స్విచాఫ్‌ అయ్యేంత వరకు వారు ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారనే కోణంలో విచారణ చేస్తున్నారు. పోలీసు జాగిలాన్ని తీసుకురాగా, అది గన్నీ సంచుల గోదాంను ఆనుకునే ఉన్న భవనం పై అంతస్తులో ఉన్న గదికి పలుసార్లు వెళ్లి వచ్చింది. మృతదేహాలున్న బావి చుట్టూ తిరిగింది. కరీమాబాద్‌లో ఉంటున్న షకీల్‌ కూడా పార్టీకి వెళ్లాడు. నగరం నుంచి గొర్రెకుంటకు వెళ్లే మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను, షకీల్‌ ఫోన్‌ కాల్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మక్సూద్‌ తన భర్తకు ఫోన్‌ చేస్తే వెళ్లాడని షకీల్‌ భార్య చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షకీల్‌ ఫోన్‌ కీలకం కానుంది.

నాలుగు మృతదేహాలపై స్వల్ప గాయాలు

ఈనాడు, వరంగల్‌: గురువారం బావిలో తేలిన నాలుగు మృతదేహాలపై పెద్దగా గాయాలు లేకున్నా ఛాతీ, కాళ్లు తదితర భాగాలపై గాట్లు ఉన్నట్టు, శుక్రవారం తేలిన మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్టు పరీక్షలో వెల్లడైంది. కొట్టి బావిలో పడేశారా, అచేతన స్థితిలో ఉండగా, నీళ్లలో పడేశారా? అనే విషయం తెలుసుకునేందుకు మృతుల శరీర భాగాలను డయాటమ్‌ పరీక్ష కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు. విషప్రయోగం జరిగిందా అనే విషయం తెలుసుకునేందుకు విసెర పరీక్ష కూడా చేశారు. నివేదిక రావడానికి వారం, పది రోజుల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

మక్సూద్‌పైనే అనుమానాలు

అనుమానాస్పద మరణాల వ్యవహారంలో మృతుడు మక్సూద్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తొమ్మిది మందిలో ఒకరే మగతలో ఉన్న మిగిలిన వారందరినీ బావిలో పడేసిన అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనేది పోలీసుల అనుమానం. భోజనంలో విషం కలిపి ఉంటేనే ఎవరికీ తెలియకుండా తిని స్పృహ కోల్పోయే అవకాశముంది. బుధవారం రాత్రి ఏడు గంటలకు షకీల్‌కు మక్సూద్‌ ఫోన్‌ చేసి తమ ఇంటికి రమ్మని పిలిచినట్లు వస్తున్న సమాచారం కూడా అనుమానాలకు తావిస్తోంది. మక్సూదే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటే వివాహేతర సంబంధం లాంటి కారణం ఉండి ఉండొచ్చని పోలీసుల అంచనా.

మక్సూద్‌ జేబులో కండోమ్‌లు

మక్సూద్‌ కుటుంబం నివసించిన గదులను పోలీసులు తనిఖీ చేస్తుండగా, మక్సూద్‌ జేబులో కండోమ్‌ ప్యాకెట్‌ కనిపించింది. వివాహితుడైన అతడి జేబులో ఈ ప్యాకెట్‌ ఉండడానికి కారణాలేంటనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోస్టుమార్టం కీలకం

మృతదేహాలకు ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం డాక్టర్‌ రజామాలిక్‌ నేతృత్వంలో పోస్టుమార్టం చేశారు. ఈ నివేదిక వస్తే కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశముంది.

ఇవీ చూడండి:ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details