రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసులు నిఘా పెంచారు. వివిధ జిల్లాల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో.. అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు నిందితులను అరెస్ట్ చేశారు.
విశాఖ జిల్లాలో..
లారీలో అక్రమంగా తరలిస్తున్న 1080 మద్యం సీసాలను ఆనందపురం మండలం గండిగుండం వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారంతో ఇనుము లోడు లారీని, షిప్ట్ కారును గండిగుండం పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. రెండు వాహనాల్లో అక్రమ మద్యం సీసాలను గుర్తించిన పోలీసులు వాటితో పాటు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు. నిందితులు మద్యాన్ని ఒడిసా నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా..
క్రోసూరులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో అక్రమ మద్యం రవాణా జరుగుందన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఏడు గోతాల్లో తరలిస్తున్న 2400 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. విలువ సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. విచారణ చేపట్టారు.