తాడిపత్రి ఘటనలో పోలీసుల తీరుపై నేతల ఆగ్రహం తాడిపత్రిలో గురువారం ఘర్షణకు సంబంధించి తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డితోపాటు... మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కులం పేరుతో దూషించారని, దాడి చేశారని ఆరోపిస్తూ వైకాపా కార్యకర్త మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు సీఐ తేజమూర్తి తెలిపారు. ఈ ఘటనకు ప్రధాన కారణం తెదేపా కార్యకర్తలు వలీబాషా, దాసరి కిరణ్‌లేనని... డీఎస్పీ చైతన్య చెప్పారు.
సుమోటోగా కేసులు...
ఇసుక బండ్ల యజమానుల వద్ద ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య నగదు వసూలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వలీ ఆడియో సందేశాలు పోస్టు చేశాడని వెల్లడించారు. వాటిని దాసరి కిరణ్ వైరల్ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఇద్దరిపైనా సుమోటోగా కేసులు నమోదు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఘర్షణలకు దిగిన ఇరువర్గాల వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు వివరించారు. తెదేపా నాయకులు ఫిర్యాదు చేస్తే వైకాపా నాయకులపైనా కేసులు పెడతామని స్పష్టంచేశారు.
తెదేపా నేతల ధ్వజం...
తాడిపత్రిలో రాజారెడ్డి రాజ్యాంగ అమలవుతోందని తెలుగుదేశం ధ్వజమెత్తింది. దౌర్జన్యానికి పాల్పడిన వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డిని వదిలేసి... బాధితులైనన జేసీ దివాకర్‌రెడ్డి సహా తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టడమేంటని సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే... త్వరలో 'చలో తాడిపత్రి' నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని... అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శి జగదీష్ మండిపడ్డారు. పోలీసుల వైఫల్యంతో జిల్లాలో దారుణాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.
కొనసాగుతున్న 144 సెక్షన్
తాడిపత్రిలో 144 సెక్షన్ కొనసాగిస్తున్న పోలీసులు.... భారీగా బలగాలను మోహరించారు. ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 50 మంది ప్రత్యేక విభాగం సిబ్బంది భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి... జనసంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బయటి ప్రాంతాల నుంచి ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రాకుండా ఆరు చెక్‌పోస్టులతో గస్తీ కాస్తున్నారు.
ఇదీ చదవండి
తిరుమలలో మంత్రుల అన్యమత ప్రస్తావన.. భాజపా నేతల ఆగ్రహం