గుంటూరు జిల్లా పెదకూరపాడు మండల కేంద్రం, కంభంపాడు గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితి నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దె తిరుపతిరావు, జిల్లా ఐకాస నాయకులు మల్లికార్జునరావుతోపాటు.. వివిధ ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం నిర్వహణ సందర్భంగా.. కోవిడ్ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో... 16 మందిపై కేసు నమోదు చేసినట్లు పెదకూరపాడు సీఐ తిరుమలరావు తెలిపారు.
‘పెదకూరపాడులోని రాజా వేణుగోపాలస్వామి ఆలయంలో రాజధాని అమరావతికి మద్దతుగా ప్రజా సంఘాలతో రాష్ట్ర జేఏసీ నేతలు ఆదివారం రాత్రి సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారం అందింది. అక్కడికి చేరుకుని ఆలయ పూజారి వేదాంతం కృష్ణకిషోరాచార్యాలు నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా కేసు నమోదు చేశాం’ అని ఆయన తెలిపారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి తప్పనిసరిగా పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు.