తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు చెట్ల కిందకు చేరారు. విధుల్లో ఉన్న పోలీసులు గదుల్లో చేరారు. అన్ని వసతులు ఉన్నా... విద్యార్థులు ఆరు బయట చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదీ తుళ్లూరు మండలం మందడం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం కనిపించిన దృశ్యం. గత పది రోజులుగా విధుల్లో ఉన్న పోలీసులకు ఈ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. సంక్రాంతి సెలవుల అనంతరం మంగళవారం నుంచి బడులు మళ్లీ ప్రారంభమయ్యాయి. పోలీసులు మాత్రం ఆ గదులను ఖాళీ చెయ్యలేదు. ఇక్కడున్న 20 గదుల్లో ఏడింటిలో ఇంకా బస చేస్తున్నారు. దీనిపై కొందరు గ్రామస్థులు మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకుని పాఠశాలకు వెళ్లారు. కొన్ని గదులకు తాళం వేయగా... మరికొన్ని తెరిచి ఉన్నాయి. వాటిల్లో తాడు, బల్లలపై ఉతికిన దుస్తులు ఆరేసి ఉన్నాయి. ప్రార్థన జరిగే చోట, క్రీడా మైదానంలోనూ ఇదే పరిస్థితి. తరగతులు జరుగుతున్నా ఏ విధంగా బస చేస్తారని గ్రామస్థులు పోలీసులను నిలదీశారు.
మీడియాపై పోలీసుల ఆగ్రహం
సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న తుళ్లూరు, నరసరావుపేట డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డిను మీడియాపై చిందులు తొక్కారు. కొన్ని ఛానళ్లకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నామని హెచ్చరించారు. టీవీ ఛానళ్లు కావాలని ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.