ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 21, 2021, 8:18 AM IST

Updated : Jul 21, 2021, 8:29 AM IST

ETV Bharat / city

janasena: జనసేనల నిలువరింత.. ఎందుకీ నిర్బంధమని నేతల ఆగ్రహం!

ఉపాధి కార్యాలయాలకు వెళ్లకుండా జనసేన నాయకులకు ఆటంకాలు ఎదురయ్యాయి. కార్యాలయాల్లోని అధికారులకు వినతిపత్రాల సమర్పించడానికి వెళ్లిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని జనసేన ప్రకటించింది.

police arrested janasena leaders
జనసేన నేతల అరెస్ట్

జనసేన పార్టీ మంగళవారం చేపట్టిన ఉపాధి కార్యాలయాల్లో వినతిపత్రాల సమర్పణ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను నయవంచన చేసిందంటూ, ఉద్యోగాల భర్తీకి వారు ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు జనసేన ప్రకటించింది. సోమవారం రాత్రి నుంచే పోలీసులు జనసేన నాయకులకు నోటీసులిచ్చారు. అనేకచోట్ల అరెస్టులు చేయడంతో పాటు, నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు.

కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఉపాధి కల్పన అధికారులకు జనసేన వినతిపత్రాలు సమర్పించింది. కృష్ణాజిల్లా నాయకుడు అమ్మిశెట్టి వాసును గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో రాష్ట్ర ఉపాధి, శిక్షణ సంస్థ డైరెక్టర్‌ కార్యాలయంలో అధికారికి జనసేన నాయకులు పి.విజయకుమార్‌, పోతిన వెంకటమహేష్‌, బండ్రెడ్డి శ్రీరామ్‌ తదితరులు వినతిపత్రం సమర్పించారు. గుంటూరు జిల్లాలో వినతిపత్రం ఇవ్వకుండా అడ్డుకున్నారు. జిల్లా పార్టీ నాయకులు గాదె వెంకటేశ్వరరావు, కల్యాణం శివశ్రీనివాస్‌, బోని పార్వతినాయుడు, నయూబ్‌ కమాల్‌ తదితరులను అరెస్టు చేశారు.

ఉభయగోదావరిలో ఉద్రిక్తం

  • ఉభయగోదావరి జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజోలు, మామిడికుదురు, జగ్గంపేట, కిర్లంపూడిలలో నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • కాకినాడ ఉపాధి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కందుల దుర్గేష్‌, పంతం నానాజీ, శెట్టిబత్తుల రాజబాబు, పితాని బాలకృష్ణ, సరోజ, కడలి ఈశ్వరి తదితరులను అరెస్టు చేశారు.
  • పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, కనకరాజు సూరి, బొమ్మిడి నాయకర్‌ తదితరులను గృహనిర్బంధంలో ఉంచారు.
  • ఏలూరులో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఘంటసాల వెంకటలక్ష్మి, ప్రియా సౌజన్యలను అరెస్టుచేశారు.

ఇతర జిల్లాల్లో...

  • విశాఖలో ఉపాధి కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జనసేన నాయకులు కోన తాతారావు, బొడ్డేపల్లి రఘు, బోడపాటి శివదత్‌ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంచకర్ల సందీప్‌, వన్నెంరెడ్డి సతీష్‌ తదితరులు ఉపాధి అధికారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాలు సమర్పించారు.
  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముందస్తు అరెస్టులున్నా పార్టీ ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్‌, బొలిశెట్టి సత్య ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించారు.
  • ఒంగోలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కొందరిని అరెస్టులు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకనాటి గౌతమ్‌ తదితరులు ఉపాధి అధికారికి వినతిపత్రం సమర్పించారు.
  • నెల్లూరులోనూ ఉదయం నుంచి అరెస్టులు కొనసాగాయి.
  • కడప ఉపాధి కార్యాలయం మెయిన్‌ గేటు వద్దే జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సయ్యద్‌ ముకరం చాంద్‌, పందిటి మల్హోత్ర, సయ్యద్‌ హుస్సేన్‌ బాషా తదితరులను ముందస్తు అరెస్టు చేశారు.
  • చిత్తూరు జిల్లాలో పార్టీ పీఏసీ సభ్యులు పసుపులేటి హరిప్రసాద్‌, కిరణ్‌ రాయల్‌, ఆకెపాటి సుభాషిణి, రాజారెడ్డిలను గృహ నిర్బంధంలో ఉంచారు.
  • కర్నూలు జిల్లాలో పార్టీ నాయకులు చింతా సురేష్‌, రేఖగౌడ్‌లను అరెస్టు చేశారు. ఉపాధి అధికారికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం అర్షద్‌ను అరెస్టు చేశారు.
  • అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు చిలకం మధుసూదన్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు టి.సి.వరుణ్‌, ఇతర నాయకులను అడ్డుకున్నారు.

నిర్బంధాలు, అరెస్టులతో ఆపలేరు: పవన్‌

‘అన్ని జిల్లాల్లో ఉపాధి కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రాలు ఇచ్చేందుకు జనసేన ప్రయత్నిస్తే ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడింది. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం యువతను నయవంచన చేయడంతో వారు ఆక్రోశంతో ఉన్నారు. వారి తరఫున పోరాడుతుంటే అడ్డుకోవడం అప్రజాస్వామికం. నిర్బంధాలు, అరెస్టులతో గొంతునొక్కి ఆపలేరు’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘సోమవారం రాత్రి నుంచే పోలీసులు గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎంతగా కట్టడి చేయాలని చూసినా జనసేన నాయకులు, కార్యకర్తలు వినతిపత్రాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు’ అని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు జనసేనకే వర్తిస్తాయా... అధికార పార్టీ వేలమందితో చేసే కార్యక్రమాలకు ఎందుకు వర్తించవని పవన్‌ ప్రశ్నించారు.

సీఎం ఇబ్బంది పడుతున్నారు

వైకాపా ప్రభుత్వ నయవంచనతో మోసపోయిన నిరుద్యోగులకు అండగా నిలుస్తామంటే ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో వినతిపత్రాలు ఇవ్వడం పౌరులకు, వారి పక్షాన నిలిచేవారికి ఉన్న హక్కని, దీన్ని అడ్డుకోవడం నియంతృత్వమే అవుతుందని మనోహర్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

'రాష్ట్రాల అంశాల్లో కేంద్ర ఏకపక్ష చట్టాలు చెల్లవు'

Last Updated : Jul 21, 2021, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details