తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల హైదరాబాద్‌లో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం ఇందిరాపార్కు వద్ద ఆమె దీక్ష చేపట్టారు. అయితే ఒక్కరోజుకే అనుమతి ఉందని.. దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా షర్మిల దీక్ష కొనసాగించడంపై.. ఆమె దీక్షను భగ్నం చేశారు. ఇందిరా పార్కు వద్ద దీక్ష భగ్నం చేసిన అనంతరం అక్కడనుంచి లోటస్‌పాండ్‌కు నడిచి వెళ్లేందుకు షర్మిల యత్నించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై పోలీసులు ఆమెను అడ్డుకుని అరెస్టు చేసి లోటస్‌పాండ్‌లోని ఆమె ఇంటికి తరలించారు.
చెయ్యి పడితే ఊరుకునేది లేదు..
అరెస్టును ఖండిస్తూ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాను 72 గంటల దీక్షకు పూనుకున్నానని.. ఎక్కడికి తరలించినా పాదయాత్రగా వచ్చి మళ్లీ కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానన్న షర్మిల.. అరెస్ట్ చేసిన కార్యకర్తలను వదిలే వరకు మంచినీళ్లు కూడా ముట్టనన్నారు. ఇంకోసారి తనపై చెయ్యి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.