లాక్‌డౌన్ సడలింపు సమయం ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఉదయం 10.10 గంటల వరకు ఎవ్వరూ రోడ్లపై ఉండకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి.. పాస్‌లు, మినహాయింపులు లేని వాహనాలను సీజ్ చేశారు. నాంపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు తీరును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా పరిశీలించారు.
గోషామహల్ కూడలి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను జప్తు చేస్తున్నారు. రవీంద్రభారతి వద్ద లాక్‌డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో వాహనాలు ఆపి.. తనిఖీలు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎర్రగడ్డలో వాహన తనిఖీల్లో భాగంగా రైతుబజార్ నుంచి మూసాపేట వంతెన వరకు వాహనాలు నిలిచిపోయాయి. నకిలీ పాసులతో పట్టుబడ్డ వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
స్వల్ప ఉద్రిక్తత..
ఎంజే మార్కెట్ వద్ద 10 గంటల తర్వాత వాహనాల రద్దీ తగ్గకపోవడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో.. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మల్కాజిగిరి, కుషాయిగూడ, కీసర పరిధిలో పాసులు ఉన్న వాహనాలకే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. చెక్‌పోస్టుల వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
డీజీపీ పరిశీలన..
అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఉప్పల్, నాచారం, కుషాయిగూడ పరిధిలోని చెక్‌పోస్ట్‌లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. కేపీహెచ్‌బీ జాతీయ రహదారిపై లాక్‌డౌన్ పరిస్థితిని డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. అల్లాపూర్, బోరబండ, మోతీనగర్ ప్రాంతాల్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యటించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరించారు.