ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pub Case: లోతుగా పుడింగ్ అండ్​ మింక్​ పబ్ కేసు దర్యాప్తు... వెలుగులోకి సంచలన విషయాలు

By

Published : Apr 11, 2022, 12:53 PM IST

Hyderabad Pub Case: హైదరాబాద్‌ పుడింగ్ అండ్​ మింక్​ పబ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పబ్‌లో పలువురు డ్రగ్స్‌ వాడినట్లు నిర్ధరించగా.. అవి ఘటనకు రెండు వారాల ముందే పబ్‌లోకి చేరినట్లు పోలీసులు గుర్తించారు. పబ్‌ యాజమాన్యమే ఒక్కో హ్యాష్‌ ఆయిల్‌ సిగరెట్‌ 8 వేలకు అమ్మినట్లు తేలింది. మరోవైపు పబ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.. డ్రగ్స్ కట్టడికి మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

Hyderabad Pub Case
పబ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు

Hyderabad Pub Case:బంజారాహిల్స్‌ పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న అర్జున్‌, కిరణ్‌రాజ్‌ కోసం గాలిస్తున్నారు. కిరణ్‌రాజ్‌కు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. తాను విదేశాల్లో ఉన్నానని డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కిరణ్‌ పోలీసులకు మెయిల్‌ చేశాడు. పబ్‌ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నానని.. కానీ అక్కడ జరిగే డ్రగ్స్‌ వ్యవహారం తనకు తెలియదని వివరించాడు. అజ్ఞాతంలో ఉన్న అర్జున్‌ను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఘటనకు రెండు వారాల ముందే పబ్‌కు మాదకద్రవ్యాలు చేరాయని గుర్తించిన పోలీసులు.. హ్యాష్‌ఆయిల్‌ సిగరెట్లు, గంజాయి పబ్‌ యాజమాన్యమే అమ్మినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఒక్కో హ్యష్‌ ఆయిల్‌ సిగరెట్‌ 5 నుంచి 8 వేలకు విక్రయించినట్లు తేలింది. పామ్‌ యాప్‌లో నమోదైన వారికే మత్తుపదార్థాలను అందించినట్లుగా తెలుస్తోంది.

ఆ 20 మంది ఎవరు?: పబ్‌లో ఉన్న 148 మందిలో ఎవరు మత్తుపదార్థాలు తీసుకున్నారని నిర్ధారించడం పోలీసులకు సవాల్‌గా మారింది. అంతమంది నుంచి నమూనాలు సేకరించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 3న పబ్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారిలో 20 మంది వరకూ మత్తుపదార్థాలు వాడినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. 148 మందిలో ఆ ఇరవై మంది ఎవరు? వారు మాదకద్రవ్యాలు వాడినట్లు ఎలా రుజువు చేయాలనే అంశం పోలీసులకు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది.

మరింత వ్యూహాత్మకంగా.. మరోవైపు హైదరాబాద్‌ పబ్బుల్లో డ్రగ్స్‌ వినియోగం పట్ల పోలీసులు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నగరవాసులు, ఉద్యోగులు నైట్‌పార్టీలను కోరుకుంటుండగా.. మాదకద్రవ్యాల కారణం చూపుతూ విందు వినోదాలను నిలిపివేయడం సరికాదని పోలీసులు భావిస్తున్నారు. పబ్‌లు, హోటళ్లలో జరిగే విందు, వినోదాలకు ఆటంకం లేకుండా.. మత్తుపదార్థాల వాడకంపైనే ప్రత్యేక దృష్టిసారించారు. పోలీసు, అబ్కారీ శాఖల నిబంధనల ప్రకారమే పబ్‌ల సమయం పాటించాలని ఆదేశాలు జారీచేశారు. ప‌బ్‌ల‌పై నిఘా ఉంచుతూ మత్తుపదార్థాలను కట్టడి చేసే వ్యూహం అమలు చేయనున్నారు.


ఇదీ చదవండి: PUB RAID CASE : పుడింగ్ పబ్‌లోకి కొకైన్ ఎలా వచ్చింది? తీసుకొచ్చింది ఎవరు?

ABOUT THE AUTHOR

...view details