పదిహేనేళ్లుగా నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం సుడిగుండంలో చిక్కుకుంది. ఎప్పటికప్పుడు పూర్తి కావస్తోందని ప్రభుత్వాలు ఊరిస్తూ వచ్చిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు తాజాగా కేంద్రం తీసుకొన్న నిర్ణయం వల్ల ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు చేసిన ఖర్చుపోనూ మిగిలిన పనులు, పునరావాసం పూర్తి చేయడానికి రూ.30వేల కోట్లు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఏడువేల కోట్ల రూపాయలకు మించి రావు. మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇందులో నిర్వాసితులకోసం చేయాల్సిన ఖర్చే ఎక్కువ. పునరావాస ప్రక్రియతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసేలా జలాశయాన్ని నిర్మించడం వీలుకాదు. అటు డ్యాం నిర్మాణం, ఇటు పునరావాసం రెండూ సమాంతరంగా జరిగితేనే ప్రయోజనం ఉంటుంది. ఇప్పటివరకు పనులకోసం ఎక్కువ ఖర్చు చేసి పునరావాసంపై తక్కువ ఖర్చుచేశారు. దీంతో మిగిలిన ఖర్చులో 75శాతం నిర్వాసితులకోసం చేయాల్సిందే.
అశాస్త్రీయ విధానాలతో చిక్కులు
ఆరున్నర దశాబ్దాలకు పైగా కాగితాలకు పరిమితమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2005లో ప్రారంభమైంది. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. 2005-06 సంవత్సరం ధరల ప్రాతిపదికన రూ.10,151 కోట్లకు 2009లో కేంద్రం ఆమోదం తెలిపింది. తరవాత అంచనాలు సవరించి 2010-11 ధరల ప్రాతిపదికన రూ.16,010 కోట్లకు 2011లో ఆమోదించింది. 2014 నాటికి ఇందులో సగం కూడా ఖర్చుచేయలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా కల్పించి, మిగిలిన ఖర్చును తామే భరిస్తామని ప్రకటించింది. దీనిప్రకారం 2014 మార్చి 31 నాటికి పోలవరం ప్రాజెక్టుపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన మొత్తం ఖర్చు రూ.5,135.87 కోట్లు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇది జరిగిన రెండేళ్ల తరవాత- 2016 అక్టోబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోట్‌లో ఈ ప్రాజెక్టుకు ఎలా నిధులు ఇచ్చేదీ చెప్పింది. 2014 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి చేసిన ఖర్చుపోనూ... మిగిలింది పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేసింది. ప్రాజెక్టును పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన అంశం కాబట్టి, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సిఫార్సు మేరకు నిర్మాణాన్ని రాష్ట్రమే చేపట్టడానికీ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తీసుకొనేటప్పటికే రెండు ఆర్థిక సంవత్సరాలు ముగిసిపోయాయి. అంటే 2013-14 ధరల ఆధారంగా అంచనాలు తయారు చేసి 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించారు. నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని 2014లో చెప్పిన కేంద్రం- 2016 అక్టోబరు ఆఖరులో అప్పటి ధరల ప్రకారం అంచనాలు తయారు చేయమనడమే అశాస్త్రీయం. 2017 మే ఎనిమిదిన కేంద్రజలవనరుల శాఖ కార్యదర్శి ఓ లేఖరాశారు. ఇందులో 2016 అక్టోబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిన దాని ప్రకారం తాజా ధరల ఆధారంగా అదనపు వ్యయాన్ని రాష్ట్ర నిధుల నుంచే భరించాలని సూచించారు. దీని ప్రకారం తీసుకొన్నా 2017-18 ధరల మేరకు అయ్యే ఖర్చును కేంద్రం భరించాల్సి ఉంది. అలాంటిది 2020లో 2013-14 ధరల ప్రకారం; అందులోనూ తాగునీటి సరఫరా, విద్యుత్తు బ్లాక్ నిర్మాణానికి అయ్యే ఖర్చును మినహాయించి మాత్రమే ఇస్తామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు అంచనాకు కేంద్రజలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఈ ఏడాది మార్చిలో ఆమోదం తెలిపిన రోజే ఉత్తరాఖండ్‌కు చెందిన రెండు జాతీయ ప్రాజెక్టుల సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోద ముద్రవేసింది. యమునా నదిపై లఖ్వార్ బహుళార్థక ప్రాజెక్టును రూ.5,747 కోట్లకు, గంగ ఉపనదిపై జమ్రాని డ్యాం నిర్మాణానికి రూ.2,584 కోట్లకు 2018-19 ధరలతో అనుమతించి పోలవరానికి మాత్రం 2017-18 ధరలతో అంగీకరించింది. ఇప్పుడు ఇది కూడా లేకుండా 2013-14 ధరలు, ఇందులోనూ తాగునీటి ఖర్చును మినహాయించి ఇవ్వాలని నిర్ణయించింది. తాజా ధరల ఆధారంగా మిగిలిన వ్యయాన్ని రాష్ట్రం భరించాలని 2017 మేలో కేంద్రం లేఖ రాసింది కాబట్టి, జలసంఘం సాంకేతిక సలహా కమిటీ సిఫార్సు చేసినట్లయినా ఇవ్వాల్సింది పోయి అది కూడా ఇవ్వబోమని పేర్కొనడం పోలవరం నిర్మాణానికి అడ్డుకట్ట వేయడమే.
కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ 2017-18 ధరల ప్రకారం ఆమోదం తెలిపిన రూ.55,656.87 కోట్లతోపాటు, 2013-14 ధరల ప్రకారం రూ.30,718.95 కోట్లకు సంబంధించిన వివరాలనూ పంపింది. ఈ అంచనాలను పరిశీలించడానికి కేంద్ర ఆర్థిక శాఖ మరో కమిటీని నియమించింది. ఈ కమిటీ 2013-14 అంచనాను రూ.29,027.95 కోట్లకు, 2017-18 ధరలను రూ.47,725.74 కోట్లకు తగ్గించింది. తాగునీటి సరఫరా, విద్యుత్తు బ్లాక్ నిర్మాణానికి అయ్యే ఖర్చును వేరు చేసింది. చివరకు 2013-14 ధరల్లో తాగునీరు, విద్యుత్తు బ్లాక్ నిర్మాణం ఖర్చు మినహాయించి- రూ.20,398.61 కోట్లు ఇచ్చేలా ఖరారు చేసింది. ఇందులో 2014 మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును మినహాయిస్తే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు ఇచ్చిన రూ.8,614 కోట్లు పోనూ- ఇంకా రూ.7,054 కోట్లు వస్తాయి. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన దాంట్లో ఇది నాలుగోవంతు మాత్రమే. ఇదే పరిస్థితి కొనసాగితే పోలవరం నిర్మాణం మరో దశాబ్దానికి పైగా పట్టే అవకాశం ఉంది. నిర్మాణంలో జాప్యం, పాలకుల తప్పిదాల వల్ల దీని వ్యయం మరింత పెరగనుంది.