పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం ఇప్పటికే ఖర్చు చేసిన దాదాపు రూ.4,006.43 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇంతవరకూ కేంద్రం నుంచి ఏమీ రాలేదు. అసలే కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా రాష్ట్రం నిధులు ఖర్చు చేసిన తర్వాతే కేంద్రం తిరిగి చెల్లిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తికి చాలాకాలం పడుతోంది.
పోలవరం ప్రాజెక్టుకు 2014లో జాతీయహోదా ప్రకటించినా ఈ నిధుల చెల్లింపునకు అవసరమైన ప్రత్యేక బడ్జెట్ హెడ్ ఏర్పాటు చేయలేదు. దీనివల్ల ఎప్పటికప్పుడు నాబార్డు రుణం కోసం ప్రతిపాదించి, తర్వాత ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేయాల్సి వస్తోంది. తొలుత ఆంధ్రప్రదేశ్ జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి బిల్లులు పంపాలి. వారు అక్కడ పరిశీలించి ఆమోదించాక కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు పంపుతారు. అక్కడ ఆమోదం వచ్చాక కేంద్ర ఆర్థికశాఖకు పంపాలి. వారు పరిశీలించి ఆమోదిస్తే నాబార్డుకు వెళ్తుంది. అప్పుడు నాబార్డు మార్కెట్ నుంచి రుణ సమీకరణ ప్రారంభిస్తుంది. ఆ మొత్తం జాతీయ జల అభివృద్ధి సంస్థకు చేరుతుంది. అక్కడినుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఏపీ ప్రభుత్వానికి రావాలి. ఇందుకోసం ప్రతిసారీ 6-12 నెలల సమయం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమాన్ని మరింత సరళతరం చేయాలని కేంద్ర అధికారులను కోరారు.