REHABILITATION CENTER: పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణంతో అతలాకుతలమైన జీవితాలకు గోదావరి వరదలు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. ఎగువ కాఫర్ డ్యాం నిర్మించి వరద ప్రవాహానికి పెద్ద అడ్డంకి సృష్టించడంతో తలెత్తిన ముంపువల్ల సొంతూరిని, ఇళ్లను, ఆస్తులను కోల్పోతున్న వారిని ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోకపోవడంతో వందల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ‘మాకు ఇదేం ఖర్మ? ప్యాకేజీలు తేల్చి పునరావాస కాలనీలు నిర్మించి ఇస్తే మా బతకులు మేం బతుకుతాం కదా.. ఎన్నాళ్లు ఇలా? చావలేక బతుకుతున్నట్లు ఉంది’ అని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఊరిని, సర్వస్వాన్ని త్యాగం చేసినవారు ఈ వరదల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. పోలవరం విలీన మండలం చింతూరు విలవిల్లాడుతోంది. ఈ మండలంలోని 12 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఇళ్లన్నీ మునిగిపోయి వందల కుటుంబాలు వీధినపడ్డాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు సరిపోవడం లేదు. గదులన్నీ బాధితుల సామగ్రితోనే నిండిపోతున్నాయి. సాధారణంగా ఎప్పుడో ఒకసారి ప్రకృతి విపత్తులవల్ల ముంపు ఏర్పడటం వేరు. కానీ ఓ ప్రాజెక్టు కట్టి, అక్కడ ముంపు సృష్టించి, బాధితులకు పునరావాసం చూపడంలో ప్రభుత్వం విఫలం కావడంవల్ల వచ్చిన సమస్య కావడంతో వారు విలవిల్లాడుతున్నారు. అనేక కుటుంబాలవారు ఆరు బయట టెంట్లు వేసుకుని జీవిస్తున్నారు. ట్రాక్టర్లు, ఆటోలు, లారీలు, బస్టాండు ఎక్కడ పడితే అక్కడ.. బాధితులు సొంత ఖర్చులతో తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
పట్టించుకోవడం లేదు!
ఇలా ఎక్కడెక్కడో తలదాచుకున్న వారిని అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఆ ఊళ్లో అడుగుపెడితే చాలు బాధితుల అగచాట్లు కళ్లముందే కనిపిస్తున్నాయి. భోజనాలు, మంచినీటి ప్యాకెట్లు అందడం లేదు. ఆరు రోజులుగా వీధినపడి ఉంటే సర్కారీ యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. చింతూరు బస్టాండులో 4 కుటుంబాలున్నాయి. రెండు గ్యాస్ స్టౌలు పెట్టుకుని అరకొర సరకులతో స్వయంగా వండుకుని తింటున్నారు. వారం రోజులుగా చింతూరులో గ్యాస్ సరఫరా లేదు. మంచినీటి ప్యాకెట్లు లేవు. ఆ బస్టాండులో ఉన్న మహిళలు మరుగుదొడ్లు, స్నానాలకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ‘ఇళ్లు మునిగిపోయి రోడ్డున పడితే ప్రభుత్వం పూటకింత తిండి పెట్టలేదా?’ అని మానె రమేష్ అనే బాధితుడు ప్రశ్నించారు. ‘గ్యాస్ దొరకడం లేదు. బ్లాక్‌లో రూ.2,000కు తీసుకున్నాం. బస్టాండులోనే వండుకుంటున్నాం. అధికారులు పట్టించుకోరా?‘ అని నక్కా సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతూరులో పునరావాస కాలనీలో బియ్యం, కూరగాయలు సరఫరా చేస్తున్నారు. పాల ప్యాకెట్లు, నూనె ఇచ్చారు. బాధితులు ఎవరికి వారే వండుకుని తినాల్సి వస్తోంది. కొందరికి గ్యాస్ బండలు లేవు. ఎవరైనా తాము వండుకున్న తర్వాత దయతలచి స్టౌ ఇస్తే వండుకోవాల్సిన దుస్థితి కనిపిస్తోంది.
మేం సన్నద్ధంగా లేం మరి..
బాధితుల సమస్యలపై చింతూరులోని ఒక మండల స్థాయి అధికారిని ప్రశ్నిస్తే.. ‘జులైలో అనూహ్యంగా వరద వచ్చింది. మేం సన్నద్ధంగా లేం. ఇప్పటికే ఒకచోట పునరావాసం ఏర్పాటు చేస్తే అక్కడికీ నీళ్లు వచ్చేశాయి. మళ్లీ మార్చవలసి వచ్చింది. వంట చేసేవారూ ముంపులో ఉన్నారు. అందుకే బాధితులకే బియ్యం, కూరగాయలు ఇచ్చేస్తున్నాం’ అని చెప్పారు. అంటే కనీసం ముంపు ఏ స్థాయిలో వస్తుందో, ఏది రక్షిత ప్రాంతమో తెలియనంత దారుణ పరిస్థితుల్లో ఉందా యంత్రాంగం? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.