ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Statue of Equality: సంసిద్ధం శ్రీరామనగరం.. కళ్లు చెెదిరే శిల్ప కళా సౌందర్యం - unveiling of Ramanujacharya statue at muchinthal

Statue of Equality:హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామ నగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 216 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిన్నా చితకా పనులు మిగిలున్నాయి. వచ్చే నెల 2 నుంచి 14 వరకు జరిగే... వివిధ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో పరిసరాల ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నారు.

Statue of Equality
Statue of Equality

By

Published : Jan 31, 2022, 8:24 AM IST

Statue of Equality: సంసిద్ధం శ్రీరామనగరం.. కళ్లు చెెదిరే శిల్ప కళా సౌందర్యం

Statue of Equality: భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం.. కళ్లు చెదిరే శిల్ప కళా సౌందర్య నిర్మాణాలు.. విస్తుగొలిపే కళా రూపకాలతో సర్వం సిద్ధం చేసుకుని ప్రారంభోత్సవానికి సంసిద్ధమైంది శ్రీరామనగరం. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన రామానుజాచార్యులకు ఆకాశమంత గౌరవాన్ని కల్పించనుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధ్యాత్మిక నగరానికి రూపునిచ్చారు చిన్న జీయర్‌ స్వామి. రామానుజాచార్యులు.. కూర్చున్న భంగిమలో 216 అడుగుల భారీ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అందులో రామానుజుని విగ్రహం ఎత్తు 108 అడుగులు. పద్మపీఠం 27, భద్రవేదిక 54, త్రిదండం 135 అడుగుల ఎత్తు ఉన్నాయి. విగ్రహం చుట్టుకొలత 108 అడుగులు. కూర్చుని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే రెండో పెద్ద విగ్రహం ఇది. మొత్తం 1800 టన్నుల పంచలోహాలతో చైనాలో తయారుచేసిన ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా ఇక్కడికి తెచ్చారు. చైనా నిపుణులే వచ్చి ఆ భాగాలను కూర్చి విగ్రహంగా మలచారు.

అష్టదళ పద్మాకృతిలో మ్యూజిక్‌ ఫౌంటెన్‌
విగ్రహానికి ఎదురుగా అష్టదళ పద్మాకృతిలో మ్యూజిక్‌ ఫౌంటెన్‌ ఉంది. 8 సింహాలు, 8 ఏనుగులు, 8 హంసల వరుసలతో పైన కలువ విరిసినట్లుగా మధ్యలో ఫౌంటెన్‌ను తీర్చిదిద్దారు. చుట్టూ రంగురంగుల లైట్ల మధ్య పద్మాల రేకలు విచ్చుకుంటూ నీరు పడుతూ సందర్శకులను పూర్తిగా ఆధ్యాత్మికలోకంలోకి తీసుకెళ్తుంది అక్కడి దృశ్యం. విగ్రహానికి కింద మూడంతస్తులుగా ఉన్న భవనంలో విశాలమైన ధ్యానమందిరం, రామానుజుని చరిత్రనీ, తత్వాన్నీ తెలిపే చిత్రాలు ఉంటాయి. మరో అంతస్తులో వేద డిజిటల్‌ లైబ్రరీ, పరిశోధనా కేంద్రం ఉంటాయి. రామానుజుని సమతా విగ్రహం చుట్టూ ఈ 108 దివ్యదేశాల ప్రతిరూపాలనూ నిర్మించారు.

సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం... ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగనున్నాయి. 2 వారాల పాటు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు.. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. తొలుత ఫిబ్రవరి 2న ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. 3వ తేదీన చిన్న జీయర్‌ స్వామి అగ్ని ప్రతిష్ఠ చేయనున్నారు. ఆ తర్వాత.. ఫిబ్రవరి 5న సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.

బంగారు విగ్రహాన్నిఆవిష్కరించనున్నరాష్ట్రపతి
ఆ సందర్భంగా నిత్యం హోమాలు జరుగనుండగా, 8వ తేదీన సామూహిక ఆదిత్య హృదయం జపం నిర్వహించనున్నారు. 11న సామూహిక ఉపనయన కార్యక్రమం, 12న సామూహిక విష్ణు సహస్ర నామ జపం ఏర్పాటు చేయనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఆ తర్వాత కీలమైన... రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఫిబ్రవరి 13న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని రామానుజుల భారీ విగ్రహం కింద ఏర్పాటు చేయనున్నారు. దీనిని రూపొందించేందుకు దాదాపు 120 కిలోల బంగారాన్ని వినియోగించడం విశేషం. ఫిబ్రవరి 14న మహా పూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు.

రానున్న 5వేల మంది రుత్వికులు

శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు రానున్నారు. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 144 యాగశాలల్లో విశ్వశాంతి కోసం సహస్ర కుండాత్మక మహావిష్ణు యాగం చేస్తున్నారు. నాలుగు దిక్కులలో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం యాగశాలల్లో 114 చోట్ల యాగాలు జరుగుతాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టిశాలలు. వీటన్నింటిలో 1,035 హోమకుండాలు నిర్మిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపించనున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details