ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RAMAGUNDAM: దేశానికి ఆదర్శం.. రామగుండం సౌర విద్యుత్తు కేంద్రం! - Floating Power Project

Floating Solar Project : పెద్దపల్లి జిల్లా రామగుండంలో నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్‌పవర్‌ ప్రాజెక్టును ప్రధాని వర్చువల్‌ పద్ధతిలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 1 నుంచి రామగుండంలో 100 మెగావాట్ల సౌర విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభమైంది. కేరళలో 92 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, రాజస్థాన్‌లో 735 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, గుజరాత్‌లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

Floating Solar Project
Floating Solar Project

By

Published : Jul 30, 2022, 1:01 PM IST

Floating Solar Project : రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టు దేశానికి ఆదర్శం కానుంది. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు రామగుండంలో నిర్మించగా, ప్రధాని మోదీ శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ మహాఘట్టానికి ఎన్టీపీసీ యాజమాన్యం ఏర్పాట్లను పూర్తి చేసింది.

రూ.423 కోట్లతో..ఎన్టీపీసీ యాజమాన్యం జలాశయంపై రూ.423 కోట్లతో 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించింది. రెండేళ్లపాటు నిర్మాణ పనులు సాగాయి. దాదాపు 500 ఎకరాల జలాశయం నీటిపై సౌర విద్యుత్తు కేంద్రం నిర్మాణం చేపట్టారు. 40 బ్లాకుల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాక్‌లో 2.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి చేపడ్తున్నారు. హెచ్‌డీపీఈ(హై డెన్సిటీ పాలీఇథలిన్‌)తో తయారు చేసిన ఫ్లోటర్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. జులై 1న 100 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని వాణిజ్యరంగంలోకి తీసుకువచ్చారు.

రోజుకు 5 లక్షల యూనిట్లు..సాధారణ ఎండలో రోజుకు 5 లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 2 లక్షల యూనిట్లను గోవా రాష్ట్రానికి అందిస్తుండగా, మిగతా 3 లక్షల యూనిట్లను విపణికి సరఫరా చేస్తున్నారు.

ఉజ్వల్‌ భారత్‌, ఉజ్వల్‌ భవిష్య..ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ పద్ధతిలో 100 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని శనివారం జాతికి అంకితం చేయనున్నారు. పీటీఎస్‌లో భారీ తెరపై ఆన్‌లైన్‌లో వర్చువల్‌ పద్ధతిని చూడటానికి ఏర్పాట్లు చేశారు. దేశంలో పర్యావరణ హిత ప్రాజెక్టులకు ఊతమీయడానికి, విద్యుత్తు అవసరాలను ఆవశ్యకతను తెలియజేసే ఉజ్వల్‌ భారత్‌, ఉజ్వల్‌ భవిష్య కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ముఖ్య అతిథులుగా..వర్చువల్‌ పద్ధతిలో జాతికి అంకితం చేసి ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ హాజరవుతున్నారు. అంతేకాకుండా ఎన్టీపీసీ జీఎం(హెచ్‌ఆర్‌) పాత్ర రానున్నారు.

దిల్లీ నుంచి ఐదు ప్రాజెక్టులకు..దేశంలోనే అతిపెద్ద 100 మెగావాట్ల రామగుండంలోని నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రంతోపాటు కేరళలోని కాయంకుళంలో 92 మెగావాట్ల నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రాలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేసి ప్రారంభిస్తారు. వీటికి తోడు రాజస్థాన్‌లోని నోఖ్‌ సౌర విద్యుత్తు కేంద్రం, లద్దక్‌ లేహ్‌లోని హైడ్రోజన్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌, గుజరాత్‌ కవాస్‌లోని హైడ్రోజన్‌ బ్లెండింగ్‌ విత్‌ నేచురల్‌ గ్యాస్‌ ప్రాజెక్టులకు భూమిపూజ చేయనున్నారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details