ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Modi on Ramanuja: దేశ ఐక్యతకు రామానుజులే ప్రేరణ - రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు మోదీ

Modi on Ramanuja: రామానుజుల విగ్రహంతో భారతదేశం మానవశక్తిని, స్ఫూర్తిని పొందుతుందని, జ్ఞానం, వైరాగ్యం, ఆదర్శాలకు ఈ విగ్రహం చిహ్నమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలతో దళిత, గిరిజన, బహుజన, మహిళలు, ఇతర అసహాయులందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు. రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికీ స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. తెలుగువారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని... తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని ప్రధాని కొనియాడారు.

Modi on Ramanuja
Modi on Ramanuja

By

Published : Feb 6, 2022, 8:12 AM IST

Modi on Ramanuja: భారతదేశ ఐక్యత, సమగ్రతకు జగద్గురువు రామానుజాచార్య ప్రేరణ అని, ఆయన బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. సద్గుణాలతోనే లోక కల్యాణం జరుగుతుందని, జాతులతో కాదని పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరూ అభివృద్ధి చెందాలని, భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం పొందాలన్నారు. ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌’ మంత్రంతో కొత్త భవిష్యత్తుకు పునాదులు పడతాయని, శతాబ్దాలుగా వేధింపులకు గురవుతున్న వారంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రామానుజుల విగ్రహంతో భారతదేశం మానవశక్తిని, స్ఫూర్తిని పొందుతుందని, జ్ఞానం, వైరాగ్యం, ఆదర్శాలకు ఈ విగ్రహం చిహ్నమని పేర్కొన్నారు. దేశంలో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో దళిత, గిరిజన, బహుజన, మహిళలు, ఇతర అసహాయులందరికీ న్యాయం జరుగుతోందని వివరించారు. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో పర్యటించిన ప్రధాని అక్కడ సభలో ప్రసంగించారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మైహోం రామేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వసంత పంచమి పర్వదినం..

మోదీ ప్రసంగిస్తూ, ‘‘సరస్వతీదేవిని పూజించే పవిత్రమైన పండగ వసంత పంచమి. ఈ సందర్భంగా శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం. జ్ఞానానికి మూలం గురువు. జగద్గురు విగ్రహం, ఆయన బోధనలు అందరికీ ఆదర్శం. సమతామూర్తి భవిష్యత్తు తరాలకే కాదు.. భారత ప్రాచీన గుర్తింపును మరింత పటిష్ఠం చేస్తుంది. ఇక్కడి 108 దివ్యదేశ మందిరాల దర్శనం చేసుకున్నా. ఒకేసారి భారత్‌ మొత్తం తిరిగినంత దర్శన ఫలం రామానుజాచార్య కృపతో ఇక్కడే లభించింది. రామానుజులు భక్తి మార్గానికి పితామహుడు.

అంధ విశ్వాసాలను దూరం చేశారు..

రామానుజాచార్య జీవితాన్ని తరచి చూస్తే, ప్రగతిశీలతకు, ప్రాచీనతకు మధ్య ఎటువంటి వైరుధ్యం లేదని తెలుస్తుంది. అభివృద్ధి కోసం మూలాలకు దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. మన మూలాలతో అనుసంధానం కావడం, మన నిజమైన శక్తిని తెలుసుకోవడం ముఖ్యం. వెయ్యేళ్ల క్రితం అంధవిశ్వాసాలు ఎక్కువగా ఉండేవి. ఆ సమయంలో సమాజాన్ని ఆయన సరైన మార్గంలో నడిపించారు. భారతదేశానికి ముందున్న సవాళ్లను చూపించారు. దళిత, గిరిజన, బహుజనులను చేరదీసి, వారికి గౌరవం కల్పించారు. యాదవగిరిపై నారాయణ మందిరాన్ని నిర్మించి, అందులో దళితులకు దర్శన, పూజాధికారాలు కల్పించారు.

అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం

జాతి పేరిట కొందరిపై సమాజం భేదభావం చూపిస్తున్నప్పుడు వారికి లక్ష్మీకులంలో జన్మించిన వారని పేరిచ్చేవారు. తాను స్వయంగా స్నానం చేసిన వెంటనే వారిని తాకడం ద్వారా, అంటరానితనాన్ని దూరం చేసేందుకు సందేశాలిచ్చారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కూడా రామానుజుల మార్గంలోనే నడిచారు. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు కృషి చేశారు.

ఐక్యతా సూత్రాన్ని నేర్చుకున్నాం...

భారత్‌ ఐక్యతా సూత్రాన్ని రామానుజుల జీవనం నుంచి నేర్చుకున్నాం. ఆయన బోధనలు దేశాన్ని జాగృతం చేశాయి. ఆయన విగ్రహావిష్కరణ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సమయంలో జరుగుతోంది. రామానుజాచార్యులు ప్రబోధించిన భక్తిమార్గంలోనే గాంధీజీ నేతృత్వంలో సాగించిన స్వాతంత్య్ర పోరాటంతో భారతదేశం సంప్రదాయ విజయం సాధించింది’’ అని మోదీ అన్నారు.

అందరికీ ప్రధాన గురువు

జీవాలన్నీ సమానం. బ్రహ్మ, జీవం ఒకటే అని ప్రబోధించారు రామానుజాచార్య. తన గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఎవరికీ చెప్పవద్దన్నా.. తానొక్కరూ నరకానికి వెళ్లినా.. ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశంతో దేవాలయంపైకి ఎక్కి అందరికీ మంత్రాన్ని వినిపించారు. ఆయన దక్షిణాదిన జన్మించారు. కానీ ఆయన ప్రభావం భారతదేశం మొత్తంపై ఉంది. రామానుజుల ఔన్నత్యాన్ని అన్నమాచార్య తెలుగులో ప్రశంసిస్తే, కనక్‌దాస్‌ కన్నడంలో పాడారు. గోదాస్‌, తులసీదాస్‌ నుంచి కబీర్‌దాస్‌ వరకు అందరికీ రామానుజాచార్య ప్రధాన గురువు.

రామప్ప, పోచంపల్లి ప్రస్తావన..

హైదరాబాద్‌ అంటే.. సర్దార్‌పటేల్‌ను గుర్తుచేసుకుంటాం. ఒకవైపు సర్దార్‌పటేల్‌ స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ దేశంలో ఐక్యతా ప్రమాణాన్ని పునరావృతం చేస్తుంటే, రామానుజాచార్యుల స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ సమానత్వ సందేశాన్ని చాటుతోంది. తెలుగు సంస్కృతి మూలాలు ఏళ్ల నుంచీ ఉన్నాయి. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధినేతలు తెలుగు సంస్కృతిని సమృద్ధి చేశారు. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రుద్రేశ్వరుడు నిర్మించిన రామప్ప ఆలయాన్ని గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. యూఎన్‌డబ్ల్యూటీవో పోచంపల్లిని భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా పేర్కొంది. తెలుగు పరిశ్రమ దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విశ్వవ్యాప్తమైంది. తెలుగుకళలు, సంస్కృతి అందరికీ ప్రేరణ.

విశ్వ కుటుంబానికి ఊపిరిలూదిన రామానుజుడు


‘‘రామానుజాచార్యులు.. భగవంతుని ముందు అంతా సమానమేనని భావించిన సమతామూర్తి. భక్తులందరినీ అనుసంధానం చేశారు. వివక్ష నుంచి విముక్తి చేసిన సమసమాజ రక్షకుడు. విశ్వకుటుంబ భావనకు ఊపిరులూదారు. వ్యక్తి కన్నా సమాజ శ్రేయస్సే ముఖ్యమన్న మావనవతావాది. వైదిక సంప్రదాయాలను అందరికీ అందించారు’’ అని చినజీయర్‌స్వామి అన్నారు. రామానుజాచార్య విగ్రహావిష్కరణ అనంతరం ఆయన ప్రసంగించారు. నరేంద్ర మోదీ వ్రతబద్ధుడని, ధర్మాన్ని పాటిస్తారని ఆయన చెప్పారు. ‘‘ధరిత్రి ఆశించిన పరిపూర్ణ పాలకుడు. దసరా సమయంలో అమెరికా వెళ్లినా నియమాలను పాటించారు. పది రోజులు కేవలం జలప్రసాదంతో గడిపారు. భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏం చేయాలో అది చేస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాకే హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. భరతమాత తలెత్తుకుని చిరునవ్వులు చిందిస్తోంది. కశ్మీర్‌ భారత చిత్రపటంపై నవ్వుతూ కనిపిస్తోంది. రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి దేశ ఔన్నత్యాన్ని చాటారు. ఎంతో ప్రేమతో మోదీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు’’ అని చినజీయర్‌ తెలిపారు.

- చినజీయర్‌ స్వామి

శ్రీరాముడిలా మోదీ సద్గుణ సంపన్నుడు..

'మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచంలో భారతదేశాన్ని తలెత్తుకునేలా చేశారు. శ్రీరాముడిలా మోదీ సద్గుణ సంపన్నుడు. ఎల్లవేళలా రాజధర్మాన్ని ఆచరిస్తున్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కంకణబద్ధులై పనిచేస్తున్నారు.'

- చిన జీయర్‌ స్వామి

సమతా స్ఫూర్తికి మోదీ నిదర్శనం: కిషన్‌రెడ్డి

దేశంలోని అన్నివర్గాల ప్రజలు సమానంగా.. సంతోషంగా ఉండాలని రామానుజాచార్యులు భావించినట్లుగానే ప్రధాని మోదీ కూడా దేశాన్ని పరిపాలిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సమానత్వాన్ని ప్రబోధించిన మానవతామూర్తి రామానుజాచార్యులు దివ్యక్షేత్రాన్ని ప్రారంభించడానికి ప్రధాని అర్హులని తెలిపారు. ముచ్చింతల్‌ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సమానమని వెయ్యేళ్ల క్రితమే చాటిచెప్పిన మహానీయుడు రామానుజాచార్యులని కొనియాడారు. చిన్న దేవాలయం నిర్మించాలన్నా కష్టమని, అలాంటిది చినజీయర్‌ స్వామి ఎంతో శ్రమించి ఈ అద్భుత కళాఖండాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని హిందూ సమాజానికి అందించారని కొనియాడారు. ఆయన గ్రామాల్లోని బడుగు బలహీనవర్గాల ప్రజలకు విద్యాసంస్థలు, దేవాలయాలు, అందుబాటులోకి తెచ్చి సమానత్వం కోసం కృషి చేస్తున్నారన్నారు. సమానత్వ విలువలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే వారిలో ప్రధాని ముందుంటారన్నారు. ఇటీవల అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ చేశారని.., కాశీలో అద్భుత ఆలయాన్ని నిర్మించిన కార్మికులతో కలసి భోజనం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచంలో ప్రత్యేకస్థానం సంతరించుకోనుందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం పర్యాటక పరంగా ఎంతో తోడ్పాటునిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

పసిడి వన్నె పంచెలో.. మెరిసిన మోదీ

ఈనాడు, హైదరాబాద్‌: సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీ ఆహార్యం చూపరుల్ని విశేషంగా ఆకర్షించింది. యాగంలో పాల్గొనేందుకు వీలుగా వస్త్రధారణతో.. విష్ణునామాలు పెట్టుకుని విచ్చేశారు. బంగారు వర్ణపు పంచె ధరించి విష్వక్సేనేష్టి యాగానికి హాజరయ్యారు. ఉజ్జీవన సోపాన వేదిక నుంచి లేజర్‌ షో వీక్షించే వేదిక వరకు నడుచుకుంటూ వచ్చారు. సభ ముగిశాక ఉజ్జీవన సోపానంపై నుంచి 108 మెట్లు దిగి కిందికి వచ్చారు.

మోదీ, చినజీయర్‌స్వామి చిత్రాలతో ఆవిష్కరణ ఫలకం

సమతామూర్తి ఆవిష్కరణ ఫలకం పూర్తిగా ఆంగ్లంలో ఉంది. ‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ అని ఫలకంపై రాశారు. దీనిపై ఒకవైపు మోదీ.. మరోవైపు చినజీయర్‌స్వామి ఫొటోలు ముద్రించి ఉన్నాయి. కింద శ్రీరామానుజ సహస్రాబ్ది టీమ్‌ పేరిట డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు, కుటుంబసభ్యులు, భక్తులు అని రాశారు. మై హోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు వందన సమర్పణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


ఇదీచూడండి:Statue of Equality: సమున్నత మూర్తి.. మహోజ్వల దీప్తి

ABOUT THE AUTHOR

...view details