ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Statue of Equality: సమున్నత మూర్తి.. మహోజ్వల దీప్తి - Ramanuja Sahasrabdi Utsav

Statue of Equality: మహోన్నత దృశ్యం ఆవిష్కృతమైంది.. వెయ్యేళ్ల కిందట అవతరించిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యులు నింపిన స్ఫూర్తిని దిగంతాలకు పరిమళింపజేసే మహాఘట్టం సాక్షాత్కారమైంది. భాగ్యనగర సిగలో అద్భుత ఆభరణం చేరింది.

Statue of Equality
Statue of Equality

By

Published : Feb 6, 2022, 5:51 AM IST

Statue of Equality: భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తిని మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. భద్రవేదిపై రామానుజాచార్యుల భారీ విగ్రహం వద్ద పూజలు చేసిన అనంతరం 3డీ టెక్నాలజీ సాయంతో మూర్తిని ఆవిష్కరించారు. అంతకు ముందు సాయంత్రం 5 గంటలకు మోదీ ముచ్చింతల్‌కు చేరుకున్నారు. తొలుత హెలికాప్టర్‌లో సమతామూర్తి కేంద్రం చుట్టూ విహంగ వీక్షణం చేశారు. తర్వాత యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. విహంగ వీక్షణం సహా మోదీ పర్యటన ఆద్యంతం చినజీయర్‌స్వామి ఆయన వెంటే ఉండి క్షేత్రంలోని ప్రతి నిర్మాణం విశిష్టతలను వివరించారు.

విజయాన్ని కాంక్షిస్తూ విష్వక్సేనేష్టి

వసంత పంచమి పర్వదినం.. ప్రధాని మోదీ రాక సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేకంగా విష్వక్సేనేష్టిని నిర్వహించారు. ప్రధాని చేపట్టే అన్ని కార్యక్రమాల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో యాగం నిర్వహించగా, మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినజీయర్‌స్వామి ఆయనకు స్వర్ణకంకణాన్ని ధరింపజేశారు. అనంతరం విష్వక్సేనేష్టి పూర్ణాహుతిలో మోదీ పాల్గొని క్రతువును పూర్తి చేశారు. ప్రధానికి చినజీయర్‌స్వామి నెమలిపింఛాలతో కూడిన దండ వేసి ఆశీర్వచనాలు అందించారు. యాగశాలల నుంచి నేరుగా సమతామూర్తి కేంద్రానికి విచ్చేసిన మోదీ.. విగ్రహం చుట్టూ ఉన్న దివ్యదేశాలను సందర్శించారు. రామానుజాచార్యులకు స్ఫూర్తినిచ్చిన 106 ఆలయాలు, మరో రెండు పరమపదాలను కలుపుకొని ఆలయాలను నిర్మించినట్లు జీయర్‌ స్వామి తెలిపారు. ఎన్‌ఎఫ్‌సీ సాంకేతికతతో రూపొందించిన సెల్ఫ్‌ గైడెడ్‌ టూల్‌ సాయంతో ఒక్కొక్క ఆలయం వద్దకు చేరుకుని మోదీ హిందీలో ఆ క్షేత్ర వివరాలు విన్నారు. దాదాపు 20కి పైగా ఆలయాలను దర్శించుకుని విశేషాలు తెలుసుకున్నారు.

ఆకట్టుకున్న లేజర్‌ షో

దివ్యదేశాల సందర్శన అనంతరం ప్రధాని సమతామూర్తి కేంద్రానికి చేరుకున్నారు. విగ్రహావిష్కరణ పూర్తయ్యాక, మోదీ సహా ముఖ్యులు విజయస్తూపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైకి చేరుకుని లేజర్‌ షోను వీక్షించారు. ఈ ప్రదర్శన సందర్శకులను ఆద్యంతం ఆకట్టుకుంది. రామానుజాచార్యుల విశిష్టత, ఆయన జననం, సమతా సిద్ధాంతం.. ఇలా అన్ని అంశాలను స్పృశిస్తూ దీన్ని రూపొందించారు.

మోదీ ప్రసంగంలో తెలుగు.. తెలంగాణ

విగ్రహావిష్కరణ సభలో ప్రధాని మోదీ పలుమార్లు తెలంగాణ ప్రత్యేకతలను ప్రముఖంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన విషయాన్ని, నాటి హోంమంత్రి సర్దార్‌పటేల్‌ కృషిని గుర్తుచేశారు. ఇటీవల సినిమాలు, ఓటీటీలో కూడా తెలుగు భాష తన గుర్తింపును చాటిచెప్పిందన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మైహోం సంస్థల ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, శాసనసభ్యులు టి.ప్రకాశ్‌గౌడ్‌, రాజాసింగ్‌, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భాజపా ముఖ్యనేతలు లక్ష్మణ్‌, సినీ హీరో విజయ్‌ దేవరకొండ, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి పాల్గొన్నారు.

'నేను ఇక్కడ విష్వక్సేనేష్టి యజ్ఞంలో పాలుపంచుకున్నా. ఆ స్వామికి కృతజ్ఞుడిని. సత్సంకల్పం, లక్ష్యసాధన కోరి చేసే ఈ యజ్ఞ ఫలాలు అమృత కాల సంకల్ప సిద్ధి కోసం సమర్పిస్తున్నా. దేశంలోని 130 కోట్ల ప్రజల కలల సాకారం కోసం అర్పిస్తున్నా'. - మోదీ

ఇదీచూడండి:PM Modi on Samatamurthy: 'జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం'

ABOUT THE AUTHOR

...view details