PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపట్లో హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. ఆయన పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య విరాట్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
పర్యటనపై మోదీ ట్వీట్..
ఇవాళ్టి హైదరాబాద్ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటున్నట్లు తెలిపిన ప్రధాని... వ్యవసాయం, ఆవిష్కరణల్లో ఇక్రిశాట్ ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు రామానుజ విగ్రహావిష్కరణలో పాల్గొననున్నట్లు మోదీ తెలిపారు. రామానుజాచార్యులకు ఇది సముచితమైన నివాళిగా పేర్కొన్న మోదీ.. ఆయన పవిత్రమైన ఆలోచనలు, బోధనలు మనకు స్ఫూర్తినిస్తాయని ట్వీట్లో పేర్కొన్నారు.
పీఎం వెంటే సీఎం..
తొలుత శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి సీఎం స్వాగతం పలుకుతారు. ఆయన వెంట హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అనంతరం ముచ్చింతల్‌కు వస్తారు. ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ ముఖ్యమంత్రి మోదీ వెంటే ఉంటారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్, కిషన్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారు.
ఇక్రిశాట్ పర్యటన వివరాలు..
దిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు పటాన్‌చెరు ఇక్రిశాట్‌కు ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో ఇక్రిశాట్ ప్రాంగణంలో ల్యాండ్ అవుతారు. ఏడు నిమిషాలపాటు పంటల క్షేత్ర సందర్శన చేస్తారు. 2 గంటల 45 నిమిషాలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. అనంతరం ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను మోదీ ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఏడెనిమిది మంది శాస్త్రవేత్తలకు ఒక్కొక్కరికీ నిమిషంన్నర నుంచి 2 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించనున్నారు. ప్రధాని ఏదైనా అడిగితే శాస్త్రవేత్తలు తగిన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. శాస్త్రవేత్తలనుద్దేశించి ప్రధాని మోదీ పది నిమిషాలపాటు ప్రసంగిస్తారు. అటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 5 నిమిషాలపాటు ప్రసంగిస్తారు. ఇప్పటికే భద్రతా దళాలు ఇక్రిశాట్ ప్రాంగణాన్ని వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నాయి. 2 వేల మందికి పైగా పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కొద్ది మంది శాస్త్రవేత్తలకు మాత్రమే అనుమతినిచ్చారు.
ముచ్చింతల్ పర్యటన వివరాలు..
సాయంత్రం నాలుగున్నరకి పీఎం మోదీ తిరిగి శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని ముచ్చింతల్‌కు చేరుకుంటారు. దాదాపు 3 గంటలపాటు సమతామూర్తి కేంద్రంలోనే మోదీ పర్యటిస్తారు. మొదట యాగశాలకు చేరుకొని విశ్వక్సేనుడిని ఆరాధిస్తారు. అక్కడి నుంచి సమతామూర్తి కేంద్రానికి వస్తారు. ఆ తర్వాత 108 దివ్యదేశాలను సందర్శిస్తారు. భద్రవేది మొదటి అంతస్తులో ఉన్న రామానుజచార్యుల 120 కిలోల బంగారు విగ్రహాన్ని తిలకిస్తారు. అనంతరం భద్రవేదిపై బ్రహ్మాండ నాయకుడిగా కొలువుదీరిన సమతామూర్తి విగ్రహానికి చిన్నజీయర్ స్వామి సమక్షంలో పూజలు నిర్వహించి జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత శ్రీరామానుజచార్యుల విశిష్టతపై అరగంట పాటు ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే సమతామూర్తిపై రూపొందించిన 3డీ మ్యాపింగ్‌ను ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి వీక్షిస్తారు. సుమారు 15 నిమిషాలపాటు ఆ ప్రదర్శన ఉంటుంది. అనంతరం మచ్చింతల్ నుంచి రహదారి మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని దిల్లీ వెళ్లనున్నారు.
మోదీ హైదరాబాద్ పర్యటన సాగనుందిలా..
- మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు
- మధ్యాహ్నం 2.35 కు పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు రాక
- ఏడు నిమిషాలపాటు పంటల క్షేత్ర సందర్శన
- 2.45కు సభా వేదిక వద్దకు చేరుకోనున్న ప్రధాని
- అనంతరం ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు ప్రారంభించనున్న మోదీ
- శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ పది నిమిషాలపాటు ప్రసంగం
- సాయంత్రం నాలుగున్నరకు పీఎం మోదీ తిరిగి శంషాబాద్ రాక..
- సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి వెళ్తారు
- అతిథి గృహంలో 10 నిమిషాలు రీప్రెష్ అయి యాగశాలకు చేరుకుంటారు
- యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకొని విశ్వక్ సేనుడి పూజ చేస్తారు
- సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు
- సమతామూర్తి విగ్రహం వద్ద సుమారు అరగంట పాటు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు
- మోదీ సమక్షంలోనే రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శన ఉంటుంది
- అనంతరం.. మరోసారి యాగశాలకు చేరుకుని ఆరోజు నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ యాగానికి పూర్ణాహుతి పలుకుతారు
- 5వేల మంది రుత్వికులు ప్రధాని మోదీకి వేద అశీర్వచనం ఇస్తారు
- ఆ తర్వాత రహదారి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వెళ్తారు
- అక్కణ్నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకుంటారు.
ఇదీ చదవండి..PM Modi Hyderabad Tour: మోదీ హైదరాబాద్ టూర్.. 7 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత