ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్లాస్టిక్ వినియోగంపై ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న సీఎస్ - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్లాస్టిక్ వినియోగం, ఉత్పత్తిని నిలిపివేసే విధంగా చర్యలు చేపట్టాలని... అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ప్రధాని మోదీ సూచించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతి అంశాలపై వివిధ రాష్ట్రాల సీఎస్​లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఒకసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులను వచ్చే ఏడాది నాటికి నిషేధించాలని.. ఆ దిశగా అన్ని రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు.

pm modi conference on single used plastic
ప్లాస్టిక్ వినియోగంపై ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

By

Published : Feb 24, 2021, 10:21 PM IST

ఒకసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులను వచ్చే ఏడాది నాటికి నిషేధించాలని లక్ష్యంగా నిర్ణయించామని.. ఆ దిశగా అన్ని రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతి అంశాలపై ఆయన దిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.

నిత్యం వాడే ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్నబాటిళ్లు, స్ట్రా, సాచెట్లు తదితర ప్లాస్టిక్ వస్తువులు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని.. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు అన్నీచోట్ల దశల వారీగా ప్లాస్టిక్‌పై నిషేధం అమలు చేస్తామని ప్రధాని చెప్పారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణకు రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్, రికవర్, రీడిజైన్, రీమాన్యు ఫ్యాక్చరింగ్ అనే 6ఆర్ విధానాన్ని అనుసరించాలని సూచించారు.

అవగాహన కల్పించండి...

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో ప్లాస్టిక్ నిషేధం ఆవశ్యకతపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని... సీఎస్​లను మోదీ ఆదేశించారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులతో పర్యావరణం కలుషితం అవుతోందని, ముఖ్యంగా సముద్రాల్లో ప్లాస్టిక్ చేరి.. జలజీవజాల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుతోందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆహార ఉత్పత్తులపై ప్లాస్టిక్ పెద్దఎత్తున ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగంతో పాటు ఉత్పత్తిని నిలిపివేసే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులపై నిషేధం విధించాయని... ఆ దిశగా మిగతా రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

మనబడి నాడు-నేడులో సీఎం జగన్​ కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details