ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

E-KYC: ఈకేవైసీ లేనిదే... రైతుల ఖాతాల్లో డబ్బులు జమకావు... - ఉమ్మడి మహబూబ్​నగర్​లో ఈకేవైసీ కష్టాలు

PM Kisan Samman Nidhi EKYC: రైతులకు పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి ఈకేవైసీ చేసుకోమని ఎంత చెప్పినాసరే వారు చేసుకోవడం లేదు. దీనికి గల కారణాలు లేకపోలేదు. తప్పనిసరిగా ఇప్పుడు డబ్బులు రైతుల ఖాతాల్లో పడాలంటే ఈకేవైసీ తప్పనిసరి. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణం.. అసలు రైతులు ఎందుకు ఈకేవైసీ చేయించుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఉపయోగం ఏంటో ఒకసారి చూద్దాము.

PM Kisan Samman Nidhi EKYC
పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి ఈకేవైసీ

By

Published : Sep 15, 2022, 9:26 AM IST

PM Kisan Samman Nidhi EKYC: పీఎం కిసాన్‌ సమ్మాన్ నిధి కోసం ఈకేవైసీ సమర్పించాలన్న లక్ష్యం వ్యవసాయశాఖ అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఈకేవైసీపై రైతులు ఆసక్తి చూపకపోవటంతో పాటు సాంకేతిక లోపాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు కేంద్ర సర్కార్‌ నిర్ధేశించిన లక్ష్యానికి దూరం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించినా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా సగటున 60శాతం మాత్రమే పూర్తయినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

ఈకేవైసీ తప్పనిసరి:ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద సాయం పొందుతున్నవారు తప్పనిసరిగా ఈకేవైసీ సమర్పించాలని చాలాకాలంగా కేంద్రం కోరుతున్నా, అందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి 6వేల రూపాయల సాయాన్ని కేంద్రం అందిస్తోంది. 2018 డిసెంబర్ నుంచి అర్హులైన రైతులందరి ఖాతాలో ఏడాదిలో 3 విడతలుగా నేరుగా జమచేస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి పీఎం సమ్మాన్‌ కింద లబ్ధి పొందుతున్న రైతులు తప్పనిసరిగా ఇందుకు సమర్పించాలని చెప్పి పలుమార్లు గడువు పొడింగించింది. ఈనెలలోనే ఆఖరు తేదీ అని చెప్పినా రైతులు అందుకు ముందుకు రాలేదు.

ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లాలో ఈకేవైసీ కష్టాలు:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 5లక్షల 70వేల మంది అర్హులైన రైతులు ఈకేవైసీ సమర్పించాల్సి ఉండగా సగటున 60శాతం మంది మాత్రమే వివరాలు సమర్పించారు. 40శాతం మంది ఇంకా పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించినా రైతులు ఆసక్తి చూపడం లేదని వ్యవసాయ విస్తరణాధికారులు తలలు పట్టుకుంటున్నారు. 12వ విడత డబ్బులు జమయ్యే సమయానికైనా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఈకేవైసీ ప్రక్రియ:ఈకేవైసీ పూర్తికావాలంటే కేంద్రం డబ్బులు జమ చేసే బ్యాంకు ఖాతా, ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. ముందుగా రైతుకు ఆధార్‌తోపాటుగా దానికి ఫోన్‌నెంబర్ అనుసంధానమై ఉండాలి. ఈ ప్రక్రియ చేసే క్రమంలో సంబంధిత ఫోన్‌ నంబర్‌కే ఓటీపీ వస్తుంది. అలా అన్ని సవ్యంగా ఉంటేనే ఈ ఈకేవైసీ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటేనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపారు. ఇప్పటికి 11 విడతలుగా కిసాన్‌ సమ్మాన్ నిధులు కర్షకుల ఖాతాల్లో జమయ్యాయి.

తర్వాత ఈకేవైసీ లేకపోయినా డబ్బులు ఖాతాల్లో పడుతుండటంతో పట్టించుకోవడం మానేశారు. ఎవరైనా ముందుకొచ్చి మీ-సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లినప్పటికీ నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఆధార్‌తో గతంలో అనుసంధానమైన ఫోన్‌నంబర్ వారివద్ద లేకపోవడం, ఆధార్‌తో మొబైల్ నంబరే అనుసంధానం కాకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. వృద్ధులైతే మీ-సేవా కేంద్రాల వద్ద వేచి ఉండలేకపోతున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు, ఒక చోట భూములు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలు, నగరాల్లో నివాసించేవారి ఈకేవైసీ సైతం పూర్తికావడం లేదు. ఈ తరహా సమస్యలే 100శాతం లక్ష్యానికి దూరం చేస్తున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి ఈకేవైసీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details