పాలనా వికేంద్రీకరణ చట్టంలోని మూడు రాజధానులకు సంబంధించిన సెక్షన్లను సవాలు చేస్తూ దళిత బహుజన ఫ్రంట్ సొసైటీ కార్యదర్శి ఎం.భాగ్యరావు, మరో ఆరుగురు పిల్ దాఖలు చేశారు. ‘సంపన్నులైన రైతులు వారి ప్రయోజనాల కోసం రాజధానికి భూములిచ్చినట్లు వైకాపా మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ఎక్కువ మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారని చెబుతున్నారు. వారిని పైకి తీసుకురావడం కోసమే తెదేపా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని, బలహీనవర్గాల వారికి స్థానం లేదంటున్నారు. అయితే... రాజధానికి భూములిచ్చిన వారి వివరాలను పరిశీలించండి. భూ సమీకరణలో 34,323 ఎకరాలివ్వగా... అందులో 32శాతం భూములను ఎస్సీ, ఎస్టీలవే. మొత్తం 29,881 రైతుల్లో 25,717 మంది సన్నకారు రైతులే ఉన్నారు...’ అని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. అమరావతి నుండి వివిధ విభాగాల కార్యాలయాల తరలింపును నిలుపుదల చేయండని కూడా కోరారు.
ఒకే ఒక్క ప్రభుత్వ హామీతో...
ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామన్న ఒకే ఒక్క ప్రభుత్వ హామీతో ఎలాంటి పరిహారం పొందకుండా భూములిచ్చారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజలు అరెకరా నుండి 5 ఎకరాల వరకు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. వారికి ఆర్థిక సాయాన్ని విడుదల చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.
* రాజధాని అభివృద్ధి చేపట్టకపోవడం... సీఆర్‌డీఏ చట్టం ద్వారా రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించడమే. దీనిని రద్దు చేయడం భూములిచ్చిన రైతుల్ని, ఏపీ ప్రజల్ని ప్రభుత్వం మాయ చేయడమే. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏను రద్దు చేసే అధికారం శాసనవ్యవస్థకు లేదు. నిపుణుల కమిటీ నిర్వహించిన సర్వేలో విజయవాడ-గుంటూరు రీజియన్‌లో కొత్త రాజధాని నగరం ఏర్పాటు కోసం 52శాతం మంది అనుకూలత తెలిపారు.
* నమ్మి భారీ మెజార్టీని కట్టబెట్టారు
శాసనసభలో 2014 సెప్టెంబర్ 4న ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని నగరం ఏర్పాటును స్వాగతించారు. కనీసం 30వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గత సాధారణ ఎన్నికల ప్రణాళిక, ప్రచారంలో అమరావతి తరలింపు, మూడు రాజధానుల ఏర్పాటు అంశాల్ని ప్రస్తావించలేదు. తాడేపల్లిలో ఆయన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా తరలింపు ఉండదనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించారు. పార్టీ నేతలిచ్చిన ప్రకటనలను నమ్మి ప్రజలు ఎన్నికల్లో భారీ మెజార్టీని కట్టబెట్టారు. తెదేపా నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, బినామీ పేర్లతో భూములు కొన్నారని సీఎం జగన్, మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో తెదేపా నేతల్ని ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు.
* రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భాజపా రాజకీయ క్రీడ ఆడుతోంది.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, వైకాపా మేనిఫెస్టో ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్ కే రోజా, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైకాపా, భాజపా, తెదేపా, జనసేన పార్టీ అధ్యక్షులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఎకరాల వారీగా భూములిచ్చిన రైతుల వివరాలు
భూమి | రైతులు | ఎకరాలు |
ఎకరాలోపు | 20,490 | 10,035 |
ఎకరా-రెండెకరాల మధ్య | 5,227 | 7,466 |
2 నుంచి 3 ఎకరాలు | 3,337 | 10,104 |
5 నుంచి 10 ఎకరాలు | 668 | 4,421 |
10 నుంచి 20 ఎకరాలు | 142 | 4,421 |
20 నుంచి 25 ఎకరాలు | 12 | 269 |
25 ఎకరాలకు పైబడి 5 | 5 | 151 |
మొత్తం | 29,881 | 34,323 |