దేవాదాయశాఖలో రిజిస్టర్డ్ కాని దేవాలయాలకూ... 100 మీటర్లలోపు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి వీల్లేకుండా ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. రిజిస్టర్డ్ అయిన దేవాలయాలకే ఆ నిబంధనను వర్తింపజేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. రెవెన్యూ ( ఎక్సైజ్ శాఖ) ముఖ్యకార్యదర్శి, ఎక్సైజ్ కమిషనర్, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ, దేవాదాయ కమిషనర్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం. వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
దేవాదాయశాఖలో రిజిస్టర్డ్ అయిన దేవాలయాలకు సమీపంలో మాత్రమే 100 మీటర్లలోపు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదనే నిబంధనలను సవాలు చేస్తూ... తూర్పుగోదావరి జిల్లా గుడిముల గ్రామానికి చెందిన వై.బలరామరాజు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో రిజిస్టర్ కాని దేవాలయాల సమీపంలో ఈ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గొండి గ్రామంలోని దుర్గ దేవాలయానికి 100 మీటర్లలోపు మద్యం దుకాణం ఏర్పాటును నిలువరించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.