ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PIL IN HC ON GO'S : ఆ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ఆదేశించండి - AP GOS IN TELUGU NEWS

PIL IN HC ON GO'S : ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ విషయమై పిల్ దాఖలు చేశారు.

PIL IN HC ON GO'S
PIL IN HC ON GO'S

By

Published : Dec 19, 2021, 2:41 AM IST

Updated : Dec 19, 2021, 8:45 AM IST

PIL IN HC ON GO'S : రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేసేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు . ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను తెలుగులో నిర్వహించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. అధికార భాష పర్యవేక్షణ అధికారులను నియమించాలని, వారు ప్రతి నెల 5 లోపు నివేదికను సమర్పించేలా ఆదేశించాలన్నారు. 2017లో తీసుకొచ్చిన ఏపీ పర్యాటక , సంస్కృతి చట్టానికి అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులో నిర్వహించని అధికారులకు తెలుగు భాషాభివృద్ధి సంస్థ నిబంధన 10 ప్రకారం జరిమానా విధించేలా ఉత్తర్వులివ్వాలన్నారు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ యువత అభివృద్ధి , పర్యాటక , సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

పిటిషన్​లో ఏముందంటే...

ఏపీ అధికార భాషా చట్టం , తదనంతరం జారీ చేసిన పలు జీవోలు ప్రభుత్వ పరిపాలన , కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరగాలని స్పష్టంచేస్తున్నాయి . ప్రజలకు అర్థం అయ్యే భాషలో దస్త్రాలు నిర్వహించకపోవడం ప్రభుత్వ పాలనలో పారదర్శకత లేకుండా చేయడమే . చట్టబద్ధమైన బాధ్యతను విస్మరించడమే . ప్రభుత్వ పాలన అంశాలు , కార్యనిర్వహణ నిర్ణయాలు , జీవోలు , ప్రజా సమస్యలపై తీసుకునే ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు తెలుసుకునే హక్కుంది . ఈ నేపథ్యంలో ఆ వివరాలన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలి . అలా ఉంటేనే ప్రజాస్వామ్యంలో పౌరుల భాగస్వామ్యానికి అర్థం ఉంది . తెలుగును అధికార భాషగా వినియోగం కోసం అధికరణ 345ని అనుసరించి ఏపీ అధికార భాష చట్టం -1966 ను తెచ్చారు . ప్రభుత్వ అధికారిక పాలన , శాసనసభ కార్యకలాపాలు తెలుగులో తప్పని సరిచేయడం , ఆంగ్ల భాష వినియోగాన్ని క్రమంగా తగ్గించడం కోసం శానసకర్తల ఈ చట్టాన్ని తెచ్చారు . అప్పట్లో ప్రభుత్వం జీవో జారీచేస్తూ 23 ప్రభుత్వశాఖల పరిపాలనలో తెలుగును వినియోగించాలని స్పష్టం చేసింది . సాధారణ ప్రజానీకంతో ముడిపడి ఉన్న కార్యకలాపాలు తెలుగు భాషలో ఉండాలని పలు జీవోలో జారీచేశారు .

  • రాష్ట్రంలోని అన్ని అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు , జీవోల్లో తెలుగు భాషను వినియోగించాలని ప్రకటిస్తూ 1988 అక్టోబర్లో ప్రభుత్వం జీవో 587 జారీచేశారు . కేంద్రప్రభుత్వంతో జరిపే కార్యకాలాపాల విషయంలో మాత్రమే ఆంగ్ల వినియోగానికి పరిమితం చేశారు . 2005 సెప్టెంబర్లో జీవో 420 జారీచేస్తూ .. జీవో 587 లో చెప్పిన విషయాన్నే పునరుద్ఘాటించారు . కానీ ఇప్పటి వరకు ఆ ఉత్తర్వులేవీ అమలుకు నోచుకోలేదు .
  • 2018 లో ' ఏపీ తెలుగు భాషాభివృద్ధి సంస్థ ' నియామక నిబంధనలు జారీ చేశారు . అందులోని నిబంధన 3 ప్రకారం తెలుగు భాషాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది . తెలుగును అధికారికంగా అమలయ్యేలా చూడాల్సిన విధి ఆ సంస్థపై ఉంది . శాఖల మధ్య జరిగే కార్యకలాపాల్లో తెలుగును వినియోగించని అధికారులకు జరిమానా విధించే అధికారం తెలుగు భాషాభివృద్ధి సంస్థకు అప్పగించారు . ఇప్పటి వరకు భాషాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయలేదు.

87శాతం మందికి అర్థం కాని భాషలో ఉత్తర్వులు....


2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో 8.45 కోట్ల ప్రజలు ఉన్నారు . వారిలో 7.06 కోట్ల మంది ప్రజలది మాతృభాష తెలుగు. ఆంగ్లాన్ని అర్థం చేసుకునే వారు 1.10 కోట్ల మంది (13%) మాత్రమే . ప్రజాస్వామ్యంలో ప్రజలు భాగస్వాములు అవ్వడం అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం . అందుకు భిన్నంగా 87 శాతం ప్రజలకు అర్థం కాని భాషలో జీవోలు , ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు . ఈ తరహా చర్య ప్రజా భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని బీటలుబారేలా చేయడం తప్ప మరొకటి కాదు . ప్రభుత్వ పాలనలో పారదర్శకత , జవాబుదారీతనం , పౌరులు భాగస్వాములు కావడం ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు . ప్రభుత్వ చర్యలు , కార్యకలాపాల సమాచారాన్ని ప్రజాబాహుళ్యంలో ఉంచడం తప్పనిసరి . సమాచార హక్కు చట్టం సైతం పౌరులకు అర్థమయ్యే భాషలో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని చెబుతోంది .


ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు ఏపీ ప్రభుత్వం మొత్తం 9516 జీవోలను జారీ చేసింది . యాదృచ్ఛికంగా పరిశీలించుకుంటూ పోతే ఏ ఒక్కటీ తెలుగు భాషలో లేదు . సాంఘిక సంక్షేమ పథకాలు , ప్రజాహితం కోసం జారీ చేసే జీవోలు సైతం తెలుగులో ఇవ్వకపోవడం అధికార భాష చట్టం , రాజ్యాగ స్ఫూర్తికి విఘాతం కలిగించడమే . సాంకేతిక పరిజ్ఞాన పెరిగాక పౌరులు సులువుగా అర్థం చేసుకునేందుకు ప్రభుత్వ వెబ్సైట్లను తెలుగులో నిర్వహించాల్సిన అవసరం ఉంది . ప్రభుత్వ శాఖల చాలా వెబ్​సైట్లు ఇప్పటికీ ఆంగ్లంలోనే ఉన్నాయి . కొన్ని మాత్రమే తెలుగు , ఆంగ్లంలో కనిపిస్తున్నాయి . అధికార భాష కమిషన్ కొన్ని జిల్లాలో సమీక్షసమావే శాలు నిర్వహించింది . కార్యాలయాల్లో అత్యంత స్వల్పంగా తెలుగును అధికార భాషగా అమలు చేస్తున్నారని తెలిపింది .

విన్నవించినా స్పందన లేదు..

ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగును అధికార భాషగా వినియోగించాలని , గతంలో ఇచ్చిన జీవోలను అమలు చేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చి , సెప్టెంబర్ నెలల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , పర్యాటక , సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శికి వినతి సమర్పించాం. వాటిపై ఇప్పటి వరకు స్పందన లేదు . సమాచారం అందని పౌరుడు ప్రభుత్వ పాలనకు దూరంగా ఉండటమే కాకుండా .. మానసిక బహిష్కరణ బాధకు గురవుతాడు . అర్థమయ్యే భాష వినియోగం ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత అందుబాటులో ఉంచుతుంది . ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ ఉత్తర్వులు , కార్యాలయాల అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగు భాషలోనూ జారీచేసేలా ఆదేశించండి ' అని పిటిషన్లో పేర్కొన్నారు .

ఇదీ చదవండి:Lokesh On Pending Bills: వడ్డీతో సహా వసూలు చేస్తాం: లోకేశ్

Last Updated : Dec 19, 2021, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details