ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

police : ఇష్టానుసారంగా పోలీసుల భౌతిక దాడులు..అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే... - పోలీసుల భౌతిక దాడులు

పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కాలని సామాన్యులెవరూ కోరుకోరు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాత్రమే పోలీసుల్ని ఆశ్రయిస్తారు. న్యాయం జరగాలని ఆశిస్తారు. అన్యాయం చేసినవారిని శిక్షించాలని కోరుకుంటారు. రాష్ట్రంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. బాధితులు, అనామకులు, అమాయకులే శిక్షలకు గురువుతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరుగిన కొన్ని అమానవీయ ఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి

police
police

By

Published : Mar 19, 2022, 5:21 AM IST

Updated : Mar 19, 2022, 5:37 AM IST

రాష్ట్రంలో పోలీసు లాఠీ వికటాట్టహాసం చేస్తోంది. సంఘవిద్రోహ శక్తులకు బుద్ధి చెప్పాల్సిన రక్షక దళం సామాన్యుడిపై దాష్టీకానికి తెగబడుతోంది. అన్యాయానికి గురైన వారికి అండగా నిలబడాల్సింది పోయి.. అమాయకులపై జులుం ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తూ.. వారి సేవలో తరిస్తూ.. ప్రతిపక్షాలు, ప్రశ్నించినవారిపై దౌర్జన్యానికి దిగుతోంది. అడ్డూ అదుపూ లేకుండా కొడుతూ, అవమానిస్తూ బాధితులను బలవన్మరణాలకు ప్రేరేపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వైకాపా ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసుల ప్రవర్తన, వారి వ్యవహారశైలి తీవ్ర విమర్శల పాలవుతోంది. రెండున్నరేళ్లుగా ఇలాంటి ఘటనల్లో ఎన్నో ఫిర్యాదులు.. మరెన్నో ఆరోపణలు వస్తున్నా.. పోలీసు ఉన్నతాధికారుల నుంచి నిర్దిష్టమైన చర్యలు కరవవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టానుసారం చెలరేగిపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఇవి ఉదాహరణలు మాత్రమే. గతంలో ఎన్నడూ లేనంతగా వైకాపా ప్రభుత్వ హయాంలో పోలీసుల ప్రవర్తన, వారి వ్యవహారశైలిపై ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులైతే అధికార పార్టీ నాయకులు చెప్పినదానికల్లా తలాడిస్తున్నారు. వారు చెప్పిన వారిపైన కేసులు నమోదు చేస్తూ, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారు. అయినా క్షేత్రస్థాయి సిబ్బందిని సంస్కరించే దిశగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఏదైనా ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైనప్పుడు బాధ్యులపై తాత్కాలికంగా ఏవో చర్యలు తీసుకోవటం.. తర్వాత కొద్దిరోజులకే వాటిని ఎత్తేయటం సర్వసాధారణమైపోయింది.

పోలీసుల దాష్టీకానికి మూల్యం.. వారి ప్రాణం

నేరం తీవ్రతను బట్టి ఎలాంటి శిక్ష విధించాలో న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అయితే తెలిసోతెలియకో చిన్న చిన్న పొరపాట్లకు పాల్పడిన వారి విషయంలోనూ కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చర్చలు, కౌన్సెలింగ్‌ల ద్వారా పరిష్కరించదగ్గ అంశాల్లోనూ లాఠీకి పనిచెబుతున్నారు. అధికార పార్టీ నాయకులో, పలుకుబడి ఉన్న వ్యక్తులో చెప్పారంటూ వారి మెప్పు కోసం కొందరు పోలీసులు రెచ్చిపోయి కొడుతున్నారు. ఆ అవమానాల్ని భరించలేక రెండున్నరేళ్లలో అనేక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.

పైరవీలతో పోస్టింగులు
పోలీసు పోస్టింగుల్లో రాజకీయ జోక్యం బాగా పెరిగింది. పోలీసుస్టేషన్లలో ఎస్సై, ఇన్‌స్పెక్టర్లుగా పోస్టింగులు పొందాలంటే స్థానికంగా ఉండే అధికార పార్టీ ముఖ్య నేతల సిఫార్సులు తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితి తయారయింది. కొందరు పోలీసులు తమకు అనుకూలమైన చోట పోస్టింగ్‌ కోసం అధికార పార్టీ నాయకులకు తలొగ్గుతున్నారు. దీంతో పోలీసింగ్‌లో వారి జోక్యం పెరిగిపోయింది. నేతల ఆగడాల్ని ఎవరైనా ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని విమర్శించినా, వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా, వారి దందాలకు అడ్డు తగిలినా పోలీసులతో స్టేషన్‌కు పిలిపించటం, బెదిరించటం, వేధించటం నిత్యకృత్యమైపోయాయి. కారణమేమీ చెప్పకుండానే అక్రమంగా నిర్బంధించిన ఉదంతాలూ ఉన్నాయి.

సస్పెన్షన్లు, కేసులు.. అన్నీ మొక్కుబడే

పోలీసుల దౌర్జన్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమై.. ప్రతిపక్షాలు నిలదీస్తే తప్పనిసరి పరిస్థితుల్లో బాధ్యులపై ఉన్నతాధికారులు మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్నారు. వీఆర్‌లోకి పంపుతున్నారు లేదా సస్పెన్షన్‌ విధిస్తున్నారు. ఘటనల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పోలీసులపైన కేసులు నమోదు చేస్తున్నారు. అది కూడా పది ఘటనలు జరిగితే రెండు, మూడింటిలోనే చర్యలు ఉంటున్నాయి. ఆ ఘటనల గురించి అంతా మరిచిపోయిన తర్వాత కేసుల దర్యాప్తును పక్కనపెట్టేస్తున్నారన్న విమర్శలున్నాయి. రెండున్నరేళ్ల వ్యవధిలో ఇలాంటి ఘటనల్లో సస్పెన్షన్‌కు గురైన, వీఆర్‌లోకి వెళ్లిన సిబ్బందిలో కొందరు ప్రస్తుతం యథావిధిగా పోస్టింగులు పొందారు. దీంతో తాము ఎన్ని ఆగడాలకు పాల్పడినా తాత్కాలిక చర్యలే తప్ప.. కఠిన శిక్షలేమీ ఉండవన్న ధోరణితో చాలామంది రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు.

పోలీసు వేధింపులు తట్టుకోలేక..

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన కోన వెంకటరావు (38) తెదేపా కార్యకర్త. వైకాపా నాయకుడ్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఆ నాయకుడు హుకుం జారీ చేయగానే పోలీసులు వెంకటరావు ఇంటికి వెళ్లారు. అతను ఇంట్లో లేకపోవడంతో గంటలోగా స్టేషన్‌కు రాకపోతే కుటుంబసభ్యుల్ని తీసుకెళ్తామంటూ బెదిరించారని ఆరోపణ. ఈ నేపథ్యంలో వెంకటరావు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, వైకాపా నాయకుల వేధింపులే తన భర్త మరణానికి కారణమని వెంకటరావు భార్య కృష్ణకుమారి ఆరోపించారు.

ప్రేమ వ్యవహారంలో విచారణకు పిలిచి..

తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ప్రగడ కాళీకృష్ణ భగవాన్‌ (20)కు ఓ బాలికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే తన కుమార్తెను కాళీ ప్రేమ పేరుతో వేధిస్తున్నారంటూ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండపేట పట్టణ సీఐ దుర్గాప్రసాద్‌.. కాళీని స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టి, మర్మావయవాల వద్ద గాయపరిచారని, ఆ అవమానభారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు.

నాటుసారా అమ్మడం లేదన్నా వినకుండా..

నాటుసారా విక్రయిస్తున్నారన్న అనుమానంతో కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం రేపూడితండాలకు చెందిన లకావత్‌ బాలాజీని పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. సారా అమ్మట్లేదన్నా వినకుండా ఎస్సై టి.శ్రీనివాస్‌, కానిస్టేబుళ్లు తమ తండ్రిని విచక్షణరహితంగా కొట్టారని, తీవ్ర మనోవేదనకు గురై ఆయన పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని బాలాజీ కుమారులు ఆరోపించారు.

వీరి ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు?

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పోలీసుల వేధింపులు తాళలేక అనేక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.

* చేయని నేరాన్ని అంగీకరించాలంటూ పోలీసులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని.. ఆ అవమానాన్ని భరించలేమంటూ 2020 నవంబరులో కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన అబ్దుల్‌ సలాం, ఆయన భార్య నూర్జహాన్‌, పిల్లలు సల్మా, దాదా కలందర్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సలాం నడిపే ఆటోలో ఓ ప్రయాణికుడు రూ.70 వేలు పోగొట్టుకున్నారు. ఆ కేసులో సలాంను, ఆయన భార్యను స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు నేరం అంగీకరించాలంటూ అతణ్ని తీవ్రంగా బెదిరించారనేది అభియోగం. స్థానికంగా ఉండే ఓ నగల దుకాణం యజమాని ఒత్తిడితోనే పోలీసులు ఇలా తప్పుడు కేసులో ఇరికించారని సలాం బంధువులు ఆరోపించారు. ఈ ఘటనలో సీఐ సోమశేఖర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ గంగాధర్‌ను సస్పెండ్‌ చేసి, కేసు పెట్టారు. వారిద్దరికీ 24 గంటల్లోనే బెయిల్‌ వచ్చింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగటంతో బెయిల్‌ రద్దు చేయాలని పోలీసులు వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బెయిల్‌ రద్దయిన తర్వాత కొన్ని రోజులు జైల్లో ఉన్నారు.

* చిల్లర (పెట్టీ) కేసులో ఇరుక్కున్న తనను పోలీస్‌స్టేషన్‌ నుంచి బెయిల్‌పై విడిపించినందుకు ఓ తెదేపా నాయకుడ్ని పొగుడుతూ కృష్ణా జిల్లా పరిటాలకు చెందిన ఎం.రాజశేఖర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. వెంటనే కంచికచర్ల పోలీసులు ఆ యువకుడ్ని స్టేషన్‌కు పిలిపించి ‘తమదైన శైలి’లో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అధికార పార్టీ నాయకుడి ప్రోద్బలంతోనే మళ్లీ తనను స్టేషన్‌కు పిలిపించి అవమానించారంటూ రాజశేఖర్‌రెడ్డి విజయవాడ వచ్చి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దాన్ని జీర్ణించుకోలేక చిన్నప్పటి నుంచి అతణ్ని పెంచిన మేనత్త కూడా శానిటైజర్‌ తాగి ఆత్మహత్యకు యత్నించారు. 2020 సెప్టెంబరులో ఈ ఘటన జరిగింది.

ఎస్సీ యువకులపై అమానుష దాడి

* ఇసుక మాఫియా వెనుక వైకాపా నాయకులు ఉన్నారంటూ ఓ నాయకుడి కారు అద్దాలు పగలకొట్టారంటూ అతని అనుచరుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సీ యువకుడు ఇండుగుమిల్లి వరప్రసాద్‌ను తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు నిర్బంధించారు. అతణ్ని కొట్టి శిరోముండనం చేసి, మీసాలు తీసేసి అవమానపరిచారు. ఈ ఘటనకు బాధ్యుడిగా ఇన్‌ఛార్జి ఎస్సై ఫిరోజ్‌షా, మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు పెట్టి సస్పెండ్‌ చేశారు.

* మాస్కు ధరించకుండా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారంటూ ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్సీ యువకుడు కిరణ్‌, అతని స్నేహితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్‌ను ఎస్సై లాఠీతో కొట్టటంతో తలకు తీవ్రగాయమై చనిపోయారు. రెండేళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో అప్పట్లో ఎస్సై విజయ్‌కుమార్‌పై కేసు పెట్టి సస్పెండ్‌ చేశారు.

* అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందని బయటివారు 3 రాజధానులకు మద్దతుగా ధర్నా చేసేందుకు వస్తుంటే వారిని ప్రశ్నించినందుకు పోలీసులు ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. వారికి సంకెళ్లు వేసి మరీ తీసుకెళ్లారు.

అడ్డూ అదుపూ లేని దాడులు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన రైతు శ్రీనివాసులురెడ్డిని ఓ భూవివాదం విషయంలో పోలీసుస్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టారని ఆయన భార్య ఆరోపించారు.

* నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న ఆరోపణపై మస్తాన్‌బాబు అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన భార్యాపిల్లలతో ఓ వేడుకకు హాజరవుతుండగా.. బలవంతంగా వాహనంలోకి ఎక్కించి స్టేషన్‌కు లాక్కెళ్లారు.

ఎస్సీ వైద్యుడు సుధాకర్‌కు తీవ్ర వేధింపులు..

కరోనా సమయంలో మాస్కులు లేకుండా ఆసుపత్రికి వచ్చే రోగుల్ని చూసేదెలా? అని ప్రశ్నించినందుకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్న ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్‌ సుధాకర్‌పై ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. విశాఖపట్నంలో పోలీసులు నడిరోడ్డుపై ఆయన చేతుల్ని వెనక్కి కట్టేసి, అర్ధనగ్నంగా తీసుకెళ్లి అత్యంత హేయంగా దాడి చేశారు. ఆయన మానసిక సమస్యలతో బాధపడుతున్నారంటూ పిచ్చివాడిగా ముద్ర వేశారు. తీవ్ర మనోవేదనకు గురైన ఆయన చివరికి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, ప్రభుత్వ వేధింపులే ఆయన్ను ఆ స్థితిలోకి నెట్టాయి.

* ఓ కేసు విషయంలో బాధితుడికి అన్యాయం జరిగిందని ప్రశ్నించేందుకు వెళ్లిన రాజశేఖర్‌, రమేష్‌ అనే ఇద్దరు యువకులను మూడు రోజుల కిందట కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సై మునిప్రతాప్‌, కానిస్టేబుల్‌ చిత్రహింసలకు గురిచేశారు.

* పోలీసుల దాష్టీకం వల్లే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం, ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ కేసులో వాస్తవాలు కలవరపరిచేలా ఉన్నాయి. యూనిఫాం ధరించిన అధికారుల వల్ల నాలుగు విషాదకర మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పోలీసులకు ప్రత్యక్ష సంబంధం ఉంది.

- జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పష్టీకరణ

* అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతున్న ఓ మండల స్థాయి నాయకుడికి పోలీసు వ్యవస్థ వత్తాసు పలుకుతోంది. సీఐయే మమ్మల్ని ఎన్‌కౌంటర్‌ చేస్తానంటుంటే.. ఆత్మహత్య చేసుకోవటం తప్ప ఏం చేయగలం?

కొట్టే అధికారం పోలీసులకు లేదు.. వారిపైన కేసులు పెట్టాల్సిందే

కొంతమంది పోలీసులు బాధితుల్ని, స్టేషన్‌కు వచ్చేవారిని, ప్రజల్ని వివిధ కారణాలతో విచక్షణరహితంగా కొడుతున్నారు. ఎవర్నీ కొట్టే అధికారం పోలీసులకు లేదు. అలా చేయడం చట్టవ్యతిరేకం కూడా. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి కఠిన చర్యలు ఉండట్లేదు. వారిని వీఆర్‌లోకి పంపించామని, సస్పెండ్‌ చేశామని చెబుతున్నారు. ఇవి శాఖాపరమైన చర్యలే తప్ప శిక్షలు కాదు. చట్టప్రకారం బాధ్యులపై కేసులు నమోదు చేసి, సక్రమంగా విచారణ జరిపి త్వరితగతిన శిక్ష వేయించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయటానికి వీల్లేదని ఆదేశాలు స్పష్టంగా ఉన్నా చట్టాన్ని ఉల్లంఘించి అరెస్టులు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు వారికి అనుకూలమైన వారిని తమ పరిధిలో ఎస్సైలుగా, ఇన్‌స్పెక్టర్లుగా బదిలీలపై రప్పించుకుంటున్నారు. ఫలితంగా పోలీసు శాఖపై రాజకీయ పెత్తనం పెరిగిపోతోంది. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అదే వినే పరిస్థితి ఏర్పడింది.- ముప్పాళ్ల సుబ్బారావు, సీనియర్‌ న్యాయవాది

ఇదీ చదవండి:"పెగాసెస్ స్పైవేర్ చంద్రబాబు కొనుంటే.. వివేకా హత్య జరిగేదే కాదు"

Last Updated : Mar 19, 2022, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details