తమను కళాశాలల్లో చేర్చుకోవాలంటూ పీజీ మెడికల్ విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ ముందు ధర్నా చేశారు. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలో నిర్వహించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో కొంతమంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద సీట్లు పొందారు. కాలేజీల్లో చేరేందుకు అభ్యర్థులు వెళ్లగా కళాశాలల యాజమాన్యాలు అనుమతించట్లేదు. పలుమార్లు వర్శిటీ అధికారులను కలిసినా తమ సమస్య పరిష్కారం కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులను ఎందుకు చేర్చుకోవట్లేదో తెలపాలంటూ ఇప్పటికే వర్శిటీ అధికారులు రెండుసార్లు ప్రైవేటు మెడికల్ కళాశాలలకు సర్క్యులర్లు పంపించారు. విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు గడువును పెంచుతున్నారే తప్ప తమ సమస్యను పరిష్కరించడం లేదని పలువురు విద్యార్థులు వర్శిటీ ముందు ఆందోళన చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.