ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఫీజులపై స్పష్టత ఇవ్వకపోతే ప్రవేశాలు నిలిపివేస్తాం'

పీజీ వైద్య, దంత వైద్య కళాశాలలో కన్వీనర్, మెనేజ్​మెంట్ కోటా ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో రద్దు చేయాలని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. నీట్​ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరుగుతున్నాయన్న యాజమాన్యాలు... ఫీజుల్లో కోత విధిస్తే ప్రవేశాలు నిలిపివేసే పరిస్థితి వస్తుందన్నారు. ఫీజుల అంశంపై సీఎస్​కు లేఖ రాసినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

సీఎల్​ఎన్​ వెంకటరావు
సీఎల్​ఎన్​ వెంకటరావు

By

Published : May 30, 2020, 7:46 AM IST

పీజీ వైద్య, దంత వైద్య కోర్సుల ఫీజులపై స్పష్టత ఇవ్వకపోతే రాష్ట్రంలోని వైద్య, దంత వైద్యకళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశాలు నిలిపివేస్తామంటూ ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రకటించాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కన్నా వైద్య విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాయి.

ప్రభుత్వం ప్రైవేటు వైద్య కళాశాలలను కొవిడ్ ఆసుపత్రులుగా మార్చిందని... ఆదాయం లేక వైద్యులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కళాశాల యాజమాన్యాలు ఉన్నాయని తెలిపారు. పీజీ కోర్సుల్లో కన్వీనర్, మేనేజ్‌మెంట్‌ కోటా ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై పున: పరిశీలన చేయాలని సీఎస్​కు లేఖ రాశారు.

ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖలు రాసినట్లు తెలిపారు.

తెలంగాణలో 2017 ప్రకారం ఫీజులు అమలవుతుంటే.. రాష్ట్రంలో ఫీజులు తగ్గించడం సరికాదని జాతీయ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యుడు, భాజపా నేత సీఎల్​ఎన్​ వెంకటరావు అన్నారు. నీట్​లో వచ్చే ర్యాంకుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సాయం అందకపోయిన గత రెండు నెలలుగా కొవిడ్ విధుల్లో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం జారీచేసిన జీవోలు విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాల యాజమాన్యాల ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సీఎల్​ఎన్​ వెంకటరావు తెలిపారు.

ఇదీ చదవండి:

రైతు సంక్షేమమే ప్రాధాన్యం..: మంత్రి కన్నబాబు

ABOUT THE AUTHOR

...view details