వారంతా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది. వారి పరిధిలోని పీఎఫ్ చందాదారుల యూఏఎన్, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు తదితర వివరాలను ఎప్పటికప్పుడు ప్రైవేటు పీఎఫ్ కన్సల్టెంట్లు, వ్యక్తులకు అందజేస్తూ ప్రతిగా వారి నుంచి లంచాల రూపంలో అనుచిత లబ్ధి పొందారని సీబీఐ గుర్తించింది. విజిలెన్స్ విభాగంతో కలిసి గుంటూరు ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయంలో సీబీఐ అధికారులు ఇటీవల సంయుక్త ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ పనిచేస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషించిన సీబీఐ అధికారులు వారు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ నాలుగు వేర్వేరు కేసులను నమోదు చేసింది. ఆయా కేసుల్లో 41 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో ఉద్యోగులతో పాటు, కొందరు ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు పీఎఫ్ కన్సల్టెంట్లు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఐపీసీలోని 120బీతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7ఏ, 8 ప్రకారం వారిపై అభియోగాలు మోపింది. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా గుంటూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, గుంటుపల్లి తదితర ప్రాంతాల్లోని 40 చోట్ల నిందితుల నివాసాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించింది. పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!