నాలుగేళ్లలో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఆరేడు రూపాయలు చొప్పున పెంచడం ద్వారా చంద్రబాబు బాదుడే బాదుడు వేస్తున్నారని నాడు ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేతగా జగన్ అన్నారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో మన రాష్ట్రం కంటే లీటరుకు 7 రూపాయలు తక్కువకే దొరుకుతోందని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని రేట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపిస్తున్నాయన్నారు. 2019 మే నెలలో జగన్ సీఎం అయ్యే నాటికి తాడేపల్లిలో లీటరు పెట్రోలు ధర 76 రూపాయల89 పైసలు ఉండగా.. ఇప్పుడు 120 రూపాయల 95 పైసలు అయింది. లీటరుపై 44రూపాయల 8 పైసలు పెరిగింది. అప్పట్లో 71 రూపాయల 50 పైసలు చొప్పున ఉన్న డీజిల్ ధర ప్రస్తుతం 106 రూపాయల 58 పైసలు అయింది. అంటే లీటరుకు 35 రూపాయల 10 పైసలు పెరిగింది.
ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పెట్రోలు, డీజిల్ రేట్లపై బాదుడే బాదుడంటూ ప్రభుత్వంపై విరుచుకుపడిన జగన్.. తాను అధికారం చేపట్టాక వాటి ధరల్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలే లేవు సరికదా మరింత భారం వేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసే నాటికి పెట్రోలు, డీజిల్‌పై అదనపు వ్యాట్ లీటరుకు 2 రూపాయలు మాత్రమే ఉండగా.. దాన్ని 4 రూపాయలు చేశారు. రహదారి అభివృద్ధి నిధి పేరుతో లీటరుకు రూపాయి, దానిపై వ్యాట్ అదనమంటూ మరింత వడ్డించారు.
అప్పులపైనే ఆధారపడుతున్న రాష్ట్ర సర్కారు.. పెట్రో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకుంటోంది. ప్రత్యక్ష పన్నుల బాదుడులో కేంద్రాన్ని మించిపోయింది. పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై పన్నుల ద్వారా 2020-21లో 12 నెలల్లో వచ్చిన రాబడిని.. 2021-22లో తొలి తొమ్మిది నెలల్లోనే రాబట్టింది. పన్నుల రూపంలో వినియోగదారుల్ని పిండేయడంలో 45శాతం వృద్ధి నమోదు చేసింది. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు సుంకం, దానిపై వ్యాట్ రూపంలో 10 వేల920 కోట్లను వసూలు చేసింది. కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎంత ధర పెంచితే అందుకు అనుగుణంగా పన్ను రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతోంది.
వ్యాట్‌తోపాటు అదనపు వ్యాట్, రహదారి సుంకం అంటూ అధిక మొత్తంలో బాదుతుండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ సుంకాన్ని మించి పన్నులు విధిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా ప్రభుత్వ హయాంలో 2015 ఫిబ్రవరి 5న పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు 4 రూపాయలు చొప్పున అదనపు వ్యాట్ విధించారు. 2018లో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అదనపు వ్యాట్‌ను లీటరుకు 4 నుంచి 2 రూపాయలకి తగ్గిస్తూ 2018 సెప్టెంబరులో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక మళ్లీ అదనపు వ్యాట్‌ను పెంచింది. లీటరు పెట్రోలుపై 31శాతం వ్యాట్, 4 రూపాయల అదనపు వ్యాట్, ఒక రూపాయి చొప్పున రోడ్డు అభివృద్ధి సుంకంగా పిండుతోంది.
పొరుగునున్న కర్ణాటకలో 25.92 శాతం వ్యాట్ మాత్రమే ఉంది. తమిళనాడులో 13శాతం వ్యాట్‌తోపాటు లీటరుకు 11 రూపాయల 52 పైసల చొప్పున అదనపు వ్యాట్ తీసుకుంటోంది. డీజిల్‌పై లీటరుకు ఆంధ్రప్రదేశ్‌లో 22.25 శాతం వ్యాట్, లీటరుకు 4 రూపాయల అదనపు వ్యాట్, రోడ్డు అభివృద్ధి సుంకం ఒక రూపాయి చొప్పున పిండేస్తున్నారు. కర్ణాటకలో 14.34శాతం వ్యాట్ మాత్రమే వసూలు చేస్తున్నారు. తమిళనాడులో 11శాతం వ్యాట్‌తోపాటు లీటరుకు 9 రూపాయల 62 పైసలు అదనపు వ్యాట్‌గా వసూలు చేస్తోంది.