పెట్రో ధరల పెరుగుదల: నష్టాల బాటలో రవాణా సంస్థలు..! రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు సాధారణ ప్రజల నడ్డివిరుస్తున్నాయి. ఇంధన ధరల మంట రవాణా రంగంపై పెను ప్రభావమే చూపుతోంది. సొంత వాహనాల వినియోగం భారంగా మారి వాహనదారులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయొచ్చన్న భావనతో... కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, రోజువారీ పనుల కోసం వెళ్లేవారు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఛార్జీలు పెంచకపోవడానికి తోడు ఆర్టీసీ ఆఫర్లు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. వేసవి వేళ ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ ఇస్తుండటంతో... సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దూరప్రాంత బస్సుల్లోనూ సీట్లు నిండిపోతున్నాయి.
విజయవాడలో ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 5 శాతం పైగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల ఆదరణ పెరుగుతున్నా... పెట్రో ధరల మంట, ఛార్జీల్లో పెరుగుదల లేకపోవడం ఆర్టీసీకి భారంగా మారింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే నెలకు మూడున్నర కోట్ల రూపాయల చొప్పున... ఏడాదికి 40 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతోంది.
ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో... నష్టాలతోనే నెట్టుకొస్తున్నామని అధికారులు అంటున్నారు. ఇంధనం ధరలు తగ్గితే కొంతమేర నష్టాలు భర్తీ అవుతాయని రవాణా సంస్థలు ఎదురుచూస్తున్నాయి.
ఇదీ చదవండీ... కొవిడ్ కేర్ సెంటర్లలో ఆకలి కేకలు.. పౌష్టికాహారం పక్కదారి