ఇంధన ధరల పెరుగుదలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతలపై పెట్టుబడి ఖర్చు పెరిగింది. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం 1.51 కోట్ల ఎకరాలు. ఖరీఫ్, రబీలలో రెండు పంటలు సాగయ్యే పొలాలున్నాయి. మొత్తంగా 1.71 కోట్ల ఎకరాలకు చూసినా.. మూడేళ్లలో పెట్టుబడి వ్యయం రూ.6,800 కోట్లకు పైనే పెరిగినట్లు లెక్క.
ఉభయ గోదావరి జిల్లాల్లో వరికోత యంత్రాలకు.. మూడేళ్ల కిందట గంటకు రూ.1,700 వరకు ఉండేది. నిరుడు రూ.2,400 వరకు తీసుకున్నారు. ప్రస్తుతం డీజిల్ లీటరు రూ.వందకు చేరువ కావడంతో ధర గత ఏడాదికంటే మరో రూ.500 వరకూ పెరిగే ప్రమాదముంది.
తొలకరిలో మెట్టపంటల సాగు దుక్కి దున్నకంతో మొదలవుతుంది. నాగళ్లకు గతేడాది ఎకరాకు రూ.1,700 చొప్పున తీసుకునేవారు. ఇప్పుడు రూ.2వేలు చేశారు.
యంత్రాలే ఆధారం
దశాబ్దాల కిందట వ్యవసాయమంతా ఎద్దులతోనే చేసేవారు. క్రమంగా యంత్రాల వాడకం పెరగడంతో కాడెడ్లు కనుమరుగయ్యాయి. అన్ని పనులకు రైతులు ట్రాక్టర్లపైనే ఆధారపడుతున్నారు. పెట్రో ధరల పెరుగుదలతో పెట్టుబడి ఖర్చులూ అధికమయ్యాయి. అన్ని పంటలకు సగటున చూస్తే.. ఎకరాకు రూ.3వేలకు పైనే పెరిగాయి. అయిదెకరాలు సాగు చేసే రైతుకు ఏటా రూ.15వేల వరకు అదనపు భారమయ్యాయి.
*గొర్రు, గుంటకలు, విత్తనం ఎద పెట్టడం, తర్వాత అంతర సేద్యం రూపంలో చూస్తే.. ఎకరాకు ఆరు దఫాలు తోలించాలి. అంటే ఒక్కో ఎకరాపై రూ.1,000 వరకు పెరిగింది. పంట నూర్పిడి ఖర్చు రూపంలోనూ మరో రూ.500 వరకు భారం పడనుంది.
*సరకు రవాణా.. పొలం నుంచి ఇంటికి తీసుకురావడానికి గతంలో రూ.300 ఉండేది. ఇప్పుడు రూ.500 అవుతోంది. మార్కెట్‌కు సరకు తీసుకెళ్లాలంటే ఒక్కో క్వింటాలుకు రూ.50 వరకు పెరుగుతోంది. అంటే ఎకరాకు 25 క్వింటాళ్ల మిర్చికి మొత్తంగా రవాణాపై పరిశీలిస్తే.. రూ.1,250 వరకు అధికమవుతోంది.
*గుంటూరు జిల్లా పల్నాడులోని జూలకల్లు నుంచి గుంటూరు యార్డుకు మిర్చి బస్తాలు తీసుకెళ్లాలంటే.. మూడేళ్ల కిందట ఒక బస్తాకు రూ.40 ఖర్చు అయ్యేది. ఇప్పుడది రూ.80 పైగా అయింది. ఈ ఏడాది మరింత పెరగనుంది. పొలంలో కలుపులు, కోతలు, నూర్పిడికి కూలీలను తరలించేందుకు ఆటోకు సగటున 10 కిలోమీటర్లకు గతంలో రూ.500-600 తీసుకునేవారు. ఈసారి ఎంత పెంచుతారో తెలియదని రైతులు వాపోతున్నారు.
ఎకరా వరి సాగుపై రూ.4వేల పైనే భారం
రాష్ట్రంలో ఖరీఫ్, రబీలో కలిపి 60 లక్షల ఎకరాల్లో వరి వేస్తారు. మూడేళ్ల కిందటితో చూస్తే సగటున ఎకరాకు రూ.4,110 వరకు పెరిగాయి. అంటే అయిదెకరాలు వరి వేసే రైతుపై రూ.20వేల పైనే అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం ప్రాతిపదికన చూస్తే.. మొత్తం రూ.2,370 కోట్లు మేర రైతుల పెట్టుబడి పెరిగింది.
ట్రాక్టరు తోలకం సాలుకు రూ.200 వరకు పెరిగింది
ఆకు మడి నుంచి దమ్ము చేయించడం వరకు అన్నిటి రేట్లు పెంచేశారు. గతంలో పోలిస్తే సాలుకు రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగింది. డీజిల్ ధరలతోపాటు యంత్ర పరికరాల రేట్లు కూడా పెరిగాయి. అన్నీ కలిపితే ఎకరాకు ఎంతలేదన్నా.. రూ.3వేల పైనే పెరుగుతాయి.- ఎన్.వెంకటరమణ, కొవ్వలి, దెందులూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా