న్యాయమూర్తులకు వ్యతిరేకంగా విలేకర్ల సమావేశాలు పెట్టి మాట్లాడటాన్ని నిలువరించాలని... అలా చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ప్రశ్నిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది సునీల్‌కుమార్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసాధారణ పరిస్థితిని సృష్టించిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.
“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినిధి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిరాధార ఆరోపణలు చేసి దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ పరువు ప్రతిష్టలను దిగజార్చే ప్రయత్నం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 121, 211 ప్రకారం న్యాయమూర్తులకు వ్యతిరేకంగా అవినీతి, పక్షపాత ఆరోపణలు చేయటం పూర్తిగా నిషేధం. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీలో న్యాయమూర్తుల విధి నిర్వహణ తీరుపై చర్చించడానికి వీల్లేదు. అందుకతీతంగా సీఎం జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేయటం ద్వారా రాజ్యాంగం నిర్దేశించిన హద్దులనూ అతిక్రమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద ఉన్న భావప్రకటనా స్వేచ్ఛకూ కొన్ని హేతుబద్ధమైన పరిమితులు ఉన్నాయి. న్యాయస్థానాల తీర్పులు, అందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ప్రజాస్వామ్య సమాజంలో చర్చకు అవకాశం ఉన్నప్పటికీ వాటిని ఆధారంగా చేసుకుని న్యాయమూర్తులపై వ్యక్తిగత దాడులు చేయటానికి వీల్లేదు. ఇలాంటి సంఘటనలతో ప్రజాస్వామ్య సమాజంలో ప్రజల్లో విశ్వాసం నింపాల్సిన న్యాయవ్యవస్థ విశ్వనీయతే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఆయన ఏ నిబంధననూ పాటించినట్లు కనిపించటంలేదు. అధికార రహస్యాలను, రాజ్యాంగ విలువలను కాపాడతామని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిపై న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. రాజ్యాంగం ప్రసాదించిన అధికార విభజన సూత్రం ప్రకారం మూడు వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. ఒకరి పాత్రను మరొకరు గౌరవించాలి. ప్రస్తుత ఘటన అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. జగన్ మోహన్‌రెడ్డి వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నం తప్ప మరొకటిగా కనిపించలేదు. సుదీర్ఘకాలం న్యాయవ్యవస్థలో ఉన్న గౌరవప్రదమైన న్యాయమూర్తికి వ్యతిరేకంగా ప్రతివాది జగన్ వ్యాఖ్యలు చేసిన సమయం చాలా అనుమానాస్పదంగా ఉంది. ప్రస్తుతం దేశం వివిధ సామాజిక, ఆర్థిక సవాళ్లు, సరిహద్దుల్లో అలజడులు నెలకొన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయటం వెనుక దురుద్దేశాలు ఉన్నాయి. ప్రతివాది తన బాధ్యతారాహిత్యమైన ప్రకటన, ప్రవర్తన ద్వారా వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయటానికి చేసిన ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు...” అని ఆ పిటిషన్‌లో న్యాయస్థానికి విన్నవించారు.