2020-21 బడ్జెట్ ఆర్డినెన్స్‌ను మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పేర్ని నాని చెప్పారు. వచ్చే 3 నెలల కాలానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టు వివరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా స్వీయనియంత్రణ విధించుకున్నామని మంత్రి పేర్ని నాని వివరించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 28 వేలమంది వచ్చారని పేర్ని నాని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోందని ఉద్ఘాటించారు.
విపక్షాలు విమర్శలు సరికాదు...
క్వారంటైన్‌కు సిద్ధమైతేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్తేనే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారి సంఖ్యపై విపక్షాలు విమర్శలు సరికాదన్న పేర్ని నాని... ఈ నెల 10న సేకరించిన వివరాల ద్వారా 13 వేలమంది అని చెప్పామని వివరించారు. రెండోవిడత సర్వేలో 28 వేలమంది రాష్ట్రంలోకి వచ్చారని తేలిందని చెప్పారు.
ఐసోలేషన్ పడకల ఏర్పాటు...
ప్రతి జిల్లాకేంద్రంలో 200, నియోజకవర్గంలో వంద ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కరోనా బాధితుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని వివరించారు. 52 వేల ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉంచామన్న పేర్ని నాని... 4 వేల పీపీఈలు అందుబాటులో ఉంచామని చెప్పారు. రాష్ట్రంలో 400 వెంటలేటర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.