రాష్ట్ర నేర దర్యాప్తు విభాగం(సీఐడీ)లోని వాహనాలకు నెలవారీగా పెట్రోలు, డీజిల్ అదనపు వినియోగానికి హోంశాఖ అనుమతి ఇచ్చింది. ద్విచక్ర వాహనాల్లోని పెట్రోలు వినియోగాన్ని నెలకు 35 లీటర్ల నుంచి 50 లీటర్లకు పెంచుతూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు ఇచ్చారు.
కార్లు, జీపులు లాంటి నాలుగు చక్రాల వాహనాల్లో నెలకు 150 లీటర్ల నుంచి 300 లీటర్లకు వినియోగానికి ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్ర నేర దర్యాప్తు విభాగాన్ని (సీఐడీ) ప్రత్యేక కేసుగా గుర్తిస్తూ ఈ అదనపు ఇంధన వినియోగానికి వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఐడీ విభాగానికి కేటాయించిన బడ్జెట్లో నుంచే ఈ వ్యయాన్ని భరించాల్సిందిగా హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.