ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ - తెదేపా ప్రజాచైతన్య యాత్ర వార్తలు

ఇవాళ తెదేపా అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనపై బుధవారం రాత్రి పదింటి వరకు హైడ్రామా సాగింది. విశాఖలో చంద్రబాబు ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించగా..పలు ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేతకు ఘనస్వాగతం పలకటంలో తప్పేముందని ప్రశ్నించారు.

permission-denies-for-chandrababu-rally-in-vishaka
permission-denies-for-chandrababu-rally-in-vishaka

By

Published : Feb 27, 2020, 6:27 AM IST

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు గురువారం విశాఖపట్నంలో నిర్వహించనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు వెంట 50 మందికి మించి ఉండకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. విశాఖలో ఇతర కార్యక్రమాలకూ షరతులు విధించారు.

రాత్రి పదింటి వరకు హైడ్రామా...

విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్యయాత్రకు వెళుతూ చంద్రబాబు మార్గమధ్యలో పెందుర్తి మండలంలో భూసమీకరణ బాధితులతో మాట్లాడాల్సి ఉంది. ఉదయం 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పోలీసుల అనుమతి కోసం రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లో డీసీపీని కలిసేందుకు మంగళవారం వెళ్లగా.. మర్నాడు రమ్మని పంపేశారని తెదేపా నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ చెప్పారు. ‘బుధవారం ఉదయమే డీసీపీ- 1 రంగారెడ్డిని కలిసేందుకు పార్టీ నాయకులు వెళ్లారు. మధ్యాహ్నం వరకు వేచి ఉన్నాక అర్జీ తీసుకున్న డీసీపీ రంగారెడ్డి.. అనుమతులివ్వడం తన పరిధిలో లేదని, డీసీపీ- 2ను కలవాలని చెప్పారు. గాజువాకలో ఉన్న డీసీపీ-2ను కలవగా.. ఆయన నగర పోలీస్‌ కమిషనర్‌ను సంప్రదించాలన్నారు. తెదేపా నాయకులు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితతో కలిసి కమిషనర్‌ ఆర్కే మీనా నివాసానికి వెళ్లి రాత్రి 9 గంటల వరకు వేచి ఉన్నారు. అమరావతి పర్యటన ముగించుకుని వచ్చిన మీనాను కలిసి చంద్రబాబు ర్యాలీకి, ఇతర కార్యక్రమాలకు అనుమతులు కోరారు. అరగంటసేపు తర్జనభర్జనల అనంతరం కొన్ని షరతులతో కార్యక్రమాలకు సీపీ అనుమతిచ్చారు. ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు.

పోలీసుల ఆంక్షలు

చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు 50 మందికి మించి ఉండకూడదని, ఎక్కువ సంఖ్యలో వాహనాలను వినియోగించరాదని ఆంక్షలు విధించారు. అంతకుమించి ఉంటే కార్యక్రమాన్ని అడ్డుకుంటామన్నారు’ అని వివరించారు. పోలీసు కమిషనర్‌ కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారని వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఆరోపించారు. పార్టీ అధినేతను ఘనంగా స్వాగతించుకోవటం పరిపాటని, కావాలనే దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్‌ పాదయాత్రను నాటి తెదేపా ప్రభుత్వం అడ్డుకుని ఉంటే ఆయన 3వేల కిలోమీటర్లు తిరిగేవారా అని నిలదీశారు. చంద్రబాబు ర్యాలీలో భారీగా పాల్గొంటామని, పోలీసులు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు.

దారికి అడ్డం

ఇళ్ల స్థలాల కోసం చదును చేసిన పెందుర్తి మండలం రాంపురం వీర్రాజు చెరువును పరిశీలించేందుకు చంద్రబాబు గురువారం రావాల్సి ఉంది. ఆయన వాహన శ్రేణికి ఆటంకం కలగకుండా తెదేపా నాయకులు ఓ జిరాయితీ స్థలంలో అడ్డుగా ఉన్న మట్టిని తొలగించి చదును చేశారు. తన స్థలాన్ని ఆక్రమిస్తున్నారంటూ యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్థానిక తెదేపా నాయకుడిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ స్థలంలో వాహనాలు వెళ్లకుండా కొంతమంది అడ్డంగా తవ్వేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి : నేడు విశాఖ, విజయనగరం జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

ABOUT THE AUTHOR

...view details