పులిచింతల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. అధికారులు 20 గేట్లు ఎత్తి 6 లక్షల 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి 6లక్షల 38వేల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.58 టీఎంసీలుగా ఉంది.
నీటిలోనే పలు కాలనీలు
ప్రకాశం బ్యారేజి వద్ద క్రమంగా వరద ప్రవాహం తగ్గుతుంది. బ్యారేజీ సామర్ధ్యం కంటే అధికంగా వరద నీరు వస్తుండటంతో 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికి రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బ్యారేజి దిగువ ప్రాంతాలైన కృష్ణలంక, భుపేష్ గుప్తా నగర్ కాలనీ, రామలింగేశ్వర నగర్ తదితర చోట్ల కొన్ని ఇళ్లు నీటమునిగే ఉన్నాయి.
జాగ్రత్తగా ఉండండి: కలెక్టర్ ఇంతియాజ్
ప్రస్తుతానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినా... మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ సూచించారు. పైనుంచి వచ్చిన నీటినంతా దిగువకు వదిలేస్తున్నామని తెలిపారు. జగ్గయ్యపేట నుంచి నదీప్రవాహంలోని 18 మండలాలు మరింత అప్రమత్తంగా ఉండాలని... ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.